జాతీయ వైద్య కమిషన్ బిల్లు(ఎన్ఎంసీ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం.
ఎన్ఎంసీ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. బిల్లులో మూడున్నర లక్షల మంది అర్హతలేని వ్యక్తులను ఆధునిక వైద్య అభ్యాసానికి అనుమతించేలా ఉన్న నిబంధనను తొలగించాలని నినదించాయి.
బిల్లులోని సెక్షన్ 32 కింద ఉన్న నిబంధనను తొలగించాలని కోరింది కాంగ్రెస్. ఈ నిబంధన ద్వారా బూటకపు వైద్యం వ్యవస్థాగతమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.
సెలక్ట్ కమిటీకి పంపాలి..
ప్రైవేట్ వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలలోని 50 శాతం సీట్లకు మాత్రమే రెగ్యులేషన్ ఫీజులు వసూలు చేసేలా బిల్లులో ఉన్న నిబంధనపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. 75శాతం సీట్ల వరకూ రెగ్యులేషన్ ఫీజు వసూలు చేసేలా నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశాయి. ఆరోగ్య రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలించిన వాస్తవ బిల్లులో ఈ నిబంధనలు లేవన్నాయి విపక్షాలు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి.
ఎన్ఎంసీ బిల్లును ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు వైద్యవిద్యను బలహీనపర్చడమే కాకుండా ఆరోగ్య రంగ సేవలను నిర్వీర్యం చేస్తుందని మండిపడుతోంది.