ఇదో వలపు వల. మధ్యప్రదేశ్ కేంద్రంగా సాగిన అతిపెద్ద సెక్స్ రాకెట్. అభం శుభం తెలియని అమ్మాయిల అవసరాలే పెట్టుబడిగా... ఉన్నతాధికారులు, మంత్రుల బలహీనతల్నే అవకాశంగా చేసుకుని డబ్బు, ప్రభుత్వ కాంట్రాక్టుల్ని కొల్లగొట్టిన ఖతర్నాక్ కాంతల కామకేళీ విన్యాసం. పడకగది శృంగారం, సంభాషణలు, చాట్‌లను గుట్టుగా రికార్డుచేసి.. వాటిని చూపుతూ.. బెదిరింపులకు పాల్పడిన అతిపెద్ద సెక్స్ దందా ఇది. ఇలాంటి వీడియో దృశ్యాలు, ఆడియో రికార్డింగ్‌లు, స్క్రీన్‌షాట్స్.. అన్నీ కలిపి ఈ ముఠా దగ్గర దొరికిన ఫైల్స్ దాదాపు 4 వేలకు పైగానే! వీరి వలకు చిక్కిన ఐఏఎస్ అధికారులు దాదాపు 13 మంది.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నాయకులు, సంపన్నులు ఈ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కెమెరా కంటికి చిక్కినవారిలో భాజపా, కాంగ్రెస్ నేతలూ ఉన్నారు. 200కుపైగా మొబైల్ ఫోన్ నెంబర్లతో కూడిన ‘టార్గెట్ జాబితా’ ఈ ముఠా దగ్గర దొరికింది. మధ్య తరగతి కాలేజీ అమ్మాయిలు, సెక్స్ వర్కర్లను ఈ కుంభకోణంలో పావులుగా వాడుకుని, భారీగా డబ్బు, ఇతర ప్రయోజనాలు పొందారు. మధ్యప్రదేశ్‌తో పాటు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా విస్తరించిన ఈ భారీ సెక్స్ రాకెట్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఇది దేశంలోనే అతిపెద్ద క్విడ్ ప్రో కో(నీకిది నాకది) సెక్స్ కుంభకోణం కావొచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
నిందితుల్లో కాంగ్రెస్ మాజీ నేత భార్య కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో శ్వేతా జైన్, బర్ఖా సోని, ఆర్తి దయాళ్, 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థిని, ఆర్తి దయాళ్ డ్రైవర్‌లను పోలీసులు అరెస్టుచేశారు. బర్ఖా సోని కాంగ్రెస్ మాజీ ఐటీ సెల్ నేత అమిత్ సోని భార్య. అయితే ఆమెకు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తెలిపింది. శ్వేత జైన్ స్థానికంగా ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. ఆమె భాజపా ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్‌సింగ్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. భాజపా కార్యక్రమాల్లో ఆమె కనిపించింది. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోని బాగా పలుకుబడి ఉన్న ఒక నేతకు ఆమె సన్నిహితురాలని తెలుస్తోంది.
వెలుగులోకి ఇలా..
ఇండోర్ నగరపాలక సంస్థ ఇంజినీర్ హర్భజన్ సింగ్ ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.3 కోట్లు చెల్లించాలని తనపై ఆర్తి దయాళ్ ఒత్తిడి చేస్తోందంటూ హర్భజన్ ఫిర్యాదు చేశారు. ఇందులో తొలి విడత కింద రూ.50 లక్షలు అందుకోవడానికి ఇండోర్ వెళ్లినప్పుడు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమె చెప్పిన అంశాల ఆధారంగా మిగతా నిందితుల గుట్టు వెలుగులోకి వచ్చింది. హర్భజన్ కేసులో 18 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తండ్రి ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులపై మానవ అక్రమ రవాణా కేసును పోలీసులు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది.
విలాసాల ఆశ చూపి..
దిగువ మధ్యతరగతికి చెందిన కనీసం 20 మందికిపైగా కాలేజీ విద్యార్థినుల ద్వారా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలపై వలపు వలను విసిరినట్లు పోలీసు విచారణలో శ్వేత జైన్ అంగీకరించింది. ఉద్యోగాలు, ఖరీదైన కార్లు, ఐదు నక్షత్రాల హోటల్ గదుల్లో బస తదితరాలతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని ఆశగా చూపి ఆ ఆమ్మాయిలను ఈ మురికి కూపంలోకి నిందితులు దించారు. ఈ అమ్మాయిల్లో కొందరు మైనర్లు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల నుంచి శృంగార సంభాషణలతో కూడిన స్క్రీన్ షాట్లు, వీడియోలు, ఆడియో క్లిప్‌లతో కూడిన దాదాపు 4వేల ఫైళ్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టార్గెట్ లిస్ట్
ఒక్కో నిందితురాలు విడివిడిగా ఒక ముఠాను నడిపింది. వీరి వద్ద 200కుపైగా మొబైల్ ఫోన్ నెంబర్లతో కూడిన ‘టార్గెట్ జాబితా’ను దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారి పేర్ల పక్కన టిక్‌లు, కొన్ని సంకేతనామాలు ఉన్నాయి. వీటి గుట్టును విప్పేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఎంతటి వారైనా...
ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత ఈ వీడియో క్లిప్‌లలో గుర్తించిన అధికారులు ఎంత పెద్దవారైనా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. ‘నీకిది నాకది’ ప్రాతిపదికన ఈ నేరం జరిగిందా అన్న కోణంలో 13 మందికిపైగా సీనియర్ అధికారులపై దృష్టిసారించినట్లు సిట్ అధిపతి సంజీవ్ షామీ పేర్కొన్నారు. ఉదాహరణకు.. ఫిర్యాదుదారు హర్భజన్ ద్వారా ఈ ముఠా రూ.8 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకులందరూ మహిళలే. దీని వెనుక సూత్రధారులు ఎవరన్నదానిపై పోలీసులు దృష్టిసారించారు.
ఇదీ చూడండి: ఉగ్రకుట్ర: ఆ దేశం నుంచి వచ్చినవారే టార్గెట్!