కరోనావైరస్ వ్యాప్తితో పాఠశాలలను మూసివేసింది ప్రభుత్వం. కానీ విద్యార్థుల భవిష్యత్తు రీత్యా ఆన్లైన్ క్లాసులకు అనుమతినిచ్చింది. దీంతో విద్యార్థులు చరవాణి, ఇతర సాధనాల ద్వారా క్లాసులు వింటున్నారు. కానీ నిరుపేద విద్యార్థుల ఫోన్ కొనుక్కునే స్తోమత లేక, క్లాసులు వినలేక చదువుకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం సరికొత్త పద్ధతిని కనుగొన్నారు ఝార్ఖండ్ డుమ్కా డుమార్థర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.
విద్యార్థుల అవస్థలను గమనించిన ఉత్తమద్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ సపన్ కుమార్కు ఆన్లైన్ క్లాసులు కాకుండా నేరుగా వారి ఇళ్లలోనే పాఠాలు నేర్పించాలనే ఆలోచన వచ్చింది. దీంతో మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ విద్యార్థులకు బోధించటానికి వారి ఇళ్ల గోడలను బ్లాక్ బోర్డులుగా మలిచారు. "శిక్షా ఆప్కే ద్వార్" కార్యక్రమం కింద విద్యార్థుల ఇళ్ల గోడలపై 100కు పైగా బ్లాక్ బోర్డులుగా మార్చినట్లు సపన్ కుమార్ వెల్లడించారు.
'కొవిడ్ ప్రభావం విద్యావ్యవస్థపై ఎక్కువగా పడింది. ఈ ప్రాంత విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేవు. భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ పిల్లలకు విద్యను అందించడానికి మేము శిక్షా ఆప్కే ద్వార్ను (మీ ఇంటి వద్ద విద్య) ప్రారంభించాము. వారి ఇళ్ళ వద్దే బోధించటం కోసం గోడలపై 100 కు పైగా బ్లాక్ బోర్డులను సృష్టించాము.'అని ఒక ఉపాధ్యాయుడు చెప్పారు.
ఈ ప్రాంత ఉపాధ్యాయులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దుమ్కా డిప్యూటీ కమిషనర్ బీ. రాజేశ్వరి ఎంతో ప్రశంసించారు. ఈ పద్ధతిని ఇతర ఉపాధ్యాయులు అనుసరించటానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు.
"మా ఉపాధ్యాయులు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. పాఠశాలలు మూసివేసినప్పటి నుంచి పాఠ్యాంశాలను విద్యార్థుల వాట్సాప్‌కు పంపుతున్నాము. కానీ ఇక్కడ చాలా ప్రాంతాల్లో విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేవు. దీంతో ఉపాధ్యాయుల చేసిన ప్రయత్నాన్ని కచ్చితంగా ప్రశంసించాలి. ఈ పద్ధతిని మారుమాలు ప్రాంతాలకు విస్తరించాలి"
-రాజేశ్వరి,దుమ్కా డిప్యూటీ కమిషనర్
ఉపాధ్యాయులే ఇంటికి వచ్చి పాఠాలను బోధించటం పట్ల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
"కరోనా కారణంగా పాఠశాలను మూసివేసినప్పటికి మేం మా ఇంటి వద్దే చదువుతున్నాం. మా ఉపాధ్యాయులు ఇంటికి వచ్చి మాకు అర్థం కాని పాఠ్యాంశాలను ఎంతో చక్కగా వివరిస్తున్నారు" అని 6వ తరగతి చదువుతున్న పార్వతి అనే విద్యార్థి తెలిపింది.