తమిళనాట నీటి సంక్షోభం నానాటికీ తీవ్ర రూపం దాలుస్తోంది. తాగునీటి కోసం అక్కడి ప్రజలు కటకటలాడుతున్నారు. తాజాగా మధురై కార్పొరేషన్ పరిధిలోని ఐరావతనల్లూరులో రేషన్ కార్డుకు ఒక కూపన్ లెక్కన పంచి తాగునీటి సరఫరా చేపట్టాలని నిర్ణయించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
వేసవి తాపం ధాటికి తమిళనాట జలవనరులు అడుగంటాయి. వరుణుడు సకాలంలో కరుణించకపోవడం సమస్యను మరింత పెంచింది. ప్రభుత్వం కూడా చేసేది లేక చేతులెత్తేస్తోంది. చివరకు వర్షాలు కురవాలని అధికార ఏఐఏడీఎంకే పార్టీ పెద్దలు దేవాలయాల్లో యజ్ఞయాగాలు నిర్వహించారు.
తాగునీటికే కాదు ఇతరత్రా ఏ అవసరానికైనా వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. హోటళ్లు, అతిథి గృహాలు మూతపడ్డాయి. ఐటీ సంస్థలపైనా ఈ ప్రభావం పడింది. చివరకు నీటి సమస్యను అధిగమించేందుకు శౌచాలయానికి వినియోగిస్తున్న నీటిని కూడా పొదుపుగా వాడుకోవాల్సిన కర్మ పట్టింది.
ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ధర్నాలు చేపట్టేదాక పరిస్థితి విషమించింది.
ఇదీ చూడండి: కోలుకోని ములాయం... మరోమారు ఆస్పత్రిలో చేరిక