మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 8,369 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,27,031కి చేరింది.
మరోవైపు తమిళనాడులోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ తాజాగా మరో 4,965 కరోనా కేసులు.. 75 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో కొత్తగా 1,130 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 1,80,643కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,626 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 1,26,670 మంది డిశ్చార్జి కాగా.. 51, 344 మంది చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలో కొత్తగా 3,649 కేసులు
కర్ణాటకలోనూ కరోనా అర్రులు చాస్తోంది. ఇవాళ కొత్తగా 3,649 కేసులు.. 61 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెంగళూరులోనే 1,714 కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. దీంతో కర్ణాటకలో కరోనా కేసులు 71,069కి చేరాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,464 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 25,459 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
దిల్లీలో 1349..
దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 1349 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 27 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య లక్ష 25వేల 96కి చేరగా.. మృతుల సంఖ్య 3వేల 690కి పెరిగింది. లక్షా 6వేల 118మంది వైరస్ బారినపడి కోలుకున్నారు.
కేరళలో 720 కేసులు..
కేరళలో కొత్తగా 720 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13 వేల 994కి చేరింది. ప్రస్తుతం 8,056 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.