రానున్న బిహార్ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసు చాలా కీలకంగా కనిపిస్తోంది. నిజానికి...ఈ అంశం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. సుశాంత్‌సింగ్ ముంబయిలో ఆత్మహత్య చేసుకోవటం వల్ల అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పట్నాలోనూ కేసు నమోదైంది. ఫలితంగా... ఇది 2 రాష్ట్రాల మధ్య నలుగుతూ వస్తోంది. ముంబయి పోలీసులు సరిగ్గా విచారణ జరపటం లేదంటూ బిహార్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో మహారాష్ట్ర, బిహార్ పొలీసుల మధ్య వివాదం ముదిరింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో భాగంగా బిహార్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ ముంబయికి వెళ్లగా... ఆయనను ముంబయి పోలీసులు క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని బిహార్ పోలీసులు ముంబయి పోలీసులను కోరినా స్పందించలేదు. ఇది కాస్తా రాజకీయంగా దుమారం రేపింది.
రాజకీయ కోణం లేదు!
ప్రస్తుతానికి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పార్టీల ప్రచారాస్త్రంగా మారింది. భాజపా ఇప్పటికే 'జస్టిస్ ఫర్ సుశాంత్ రాజ్‌పూత్' పేరిట ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీకి చెందిన సాంస్కృతిక విభాగం... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం చేయాలని కోరుతూ పోస్టర్లు విడుదల చేసింది. నటుడి ఫొటోతో 'మరచిపోలేదు.. మరచిపోనివ్వం' అని రాసి ఉన్న పోస్టర్లతో ప్రచారం చేస్తోంది. సుశాంత్ మరణం ఉద్వేగభరితమైందని.. ఇందులో రాజకీయ కోణమేమీ లేదని వివరణ ఇస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 30 వేల పోస్టర్లు, స్టిక్కర్లు, 30 వేల మాస్కులు సిద్ధం చేశారు. అంతే కాదు... నలంద జిల్లాలో ప్రతిపాదిత రాజ్‌గీర్ ఫిల్మ్ సిటీకి సుశాంత్ పేరు పెట్టాలని బిహార్ భాజపా డిమాండ్ చేస్తోంది. పట్నాలోని రాజీవ్ నగర్ చౌక్ పేరును సుశాంత్ సింగ్ చౌక్ గా మార్చాలని గతంలో ప్రతిపాదించింది.
రాజ్‌పుత్‌ల ఓట్లే కీలకం
భాజపా ఇందులో రాజకీయ కోణం లేదని చెబుతూనే ప్రచారానికి సుశాంత్ సింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. రాజ్‌పుత్‌ల ఓట్ల కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. బిహార్‌లో రాజ్‌పుత్‌ల జనాభా 4శాతంగా ఉంది. మొత్తం 243 స్థానాల్లో... 40 నియోజకవర్గాల్లో వీరి ఓట్లే కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 19 మంది రాజ్‌పుత్‌లు కావటమూ ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర, బిహార్ మధ్య వివాదానికి కారణమైన ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్‌చేసింది...ఆర్‌జేడీ. సుప్రీం కోర్టు కూడా ఇందుకు ఆమోదం తెలపటం వల్ల ఇది తమ వల్లే జరిగిందని చెప్పుకుంటోంది ఆ పార్టీ. ఇక కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలన్నీ భాజపా ప్రచార సరళిపై మండి పడుతున్నాయి.
అదే అజెండాగా.. ప్రచారం
ఈ విషయంలో భాజపా వాదన మరోలా ఉంది. సుశాంత్... బిహార్‌కు చెందిన వ్యక్తి అని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకోవటంలో తప్పేముందని ప్రశ్నిస్తోంది. సుశాంత్ మరణించిన రెండు రోజులకే.. న్యాయపోరాటం ప్రారంభించామని గుర్తు చేస్తోంది. ఈ అంశం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను బిహార్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసిన సమయంలోనే భాజపా ప్రచారంలో జోరు పెంచింది. సుశాంత్‌కు న్యాయం జరగాలన్న నినాదమే ప్రధాన అజెండాగా మార్చుకుంది.
అదీ ఓ కారణం కావచ్చు!
భాజపా మాత్రమే కాదు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) కూడా సుశాంత్ ఆత్మహత్య కేసుని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకును ఈ 2 పార్టీలూ రాజ్‌పుత్‌ల ఓట్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 30మంది రాజ్‌పుత్ వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆ సమయంలో మహాఘట్‌బంధన్ అదే వర్గానికి చెందిన 12 మందితో పోటీ చేయించింది. వీరందరిలో 19 మంది విజయం సాధించగా... భాజపా తరపున గెలిచిన నీరజ్‌సింగ్... సుశాంత్ రాజ్‌పుత్ బంధువు. ఎన్నికల్లో సుశాంత్‌ఆత్మహత్య కేసు కూడా ప్రచారాంశం కావటానికి ఇదీ ఓ కారణం. సుశాంత్ బంధువు ఎమ్మెల్యే నీరజ్ కుమార్ 2005 నుంచి సహార్సా జిల్లాలోని ఛటాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే... భాజపా ఆ వర్గం ఓట్లు రాబట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఓట్ల కోసమే..
మొత్తంగా ఈ కేసు బిహార్ రాజకీయాల్లో రాజ్‌పుత్‌వర్గ ప్రాధాన్యత, ప్రభావాన్ని మరోసారి పరిచయం చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం అయినందున అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా సుశాంత్‌కు బిహార్ యువతలో ఆదరణ ఉండటం వల్ల పార్టీలు వీరినీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ఠాక్రే సర్కార్ మాత్రం ఈ పరిణామాల పట్ల అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి... సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సమయంలోనూ అభ్యంతరం వ్యక్తం చేసింది శివసేన. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించడం మహారాష్ట్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తిపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఓట్ల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతోంది.
రాజకీయ విశ్లేషకుల మండిపాటు
సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను తీసుకొస్తుంటాయి పార్టీలు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భౌతికంగా లేకపోయినా... బిహార్‌ఎన్నికల్లో ప్రచారానికి కేంద్ర బిందువుగా మారాడు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంశంపై గట్టిగానే మండిపడుతున్నారు. వీళ్లు వాళ్లన్న తేడా లేకుండా అన్ని పార్టీలూ సుశాంత్ సింగ్ మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు తేల్చే అంశాల్లో సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసు కూడా ఒకటి అన్నది అంగీకరించాల్సిన వాస్తవం.
ఇదీ చూడండి: బిహార్ పొత్తులపై ఎటూ తేల్చని ఎల్జేపీ