రఫేల్ రగడ మరోసారి రాజుకొంది. అనిల్ అంబానీ సంస్థకు రఫేల్ ఒప్పందం ముగిసిన వెంటనే పన్ను రాయితీ రూపంలో ప్రయోజనం చేకూరిందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ చొరవతో 143.7 మిలియన్ యూరోల పన్ను రాయితీని అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పొందిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు.
2015లో జరిగిన ఈ వ్యవహారంలో అంబానీకి మధ్యవర్తిగా మోదీ వ్యవహరించారని ఆరోపించారు. ఓ ఫ్రాన్స్ దినపత్రిక కథనాన్ని ఇందుకు ఆధారంగా చూపారు. రఫేల్ ఒప్పందం అనంతరమే ఈ పన్ను రాయితీ కల్పించారని ఆరోపించారు.
"2015, ఏప్రిల్ 10న 36 రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్ అంబానీపై దయ చూపింది. 143.7 యూరోల పన్ను మినహాయింపు ఇచ్చింది. దీనికి బదులుగా అనిల్ అంబానీ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ 7.6 మిలియన్లు చెల్లించారు. ఇది నేను చెప్తున్నది కాదు...ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత దినపత్రిక వెల్లడించింది. ఫ్రాన్స్ ఎలా పన్ను మినహాయింపు కల్పించిందో కథనం రాసింది...భారత పారిశ్రామిక వేత్త, డసో భాగస్వామి, ప్రధానమంత్రి మోదీకి సన్నిహిత మిత్రుడని పేర్కొంది."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
సుర్జేవాలా ఆరోపణల్ని రిలయన్స్ తిప్పికొట్టింది. మాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఫ్లాగ్ నిబంధనల మేరకే నడుచుకుందని ప్రకటించింది.