అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 2 నెలలు అవస్థలు పడ్డాడు. శస్త్రచికిత్స సమయంలో కత్తెర్లను కడుపులో మర్చిపోవడం వల్ల నొప్పితో విలవిలలాడాడు.
అసలేం జరిగిందంటే..
కేరళ త్రిస్సూర్‌లోని కూర్కంచెరీ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ జోసెఫ్ పాల్ కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లిన అతడికి.. ఏప్రిల్ 25న డాక్టర్ పాలీ టి. జోసెఫ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసింది. అయినా వ్యాధి నయం కాకపోవడం వల్ల మరోసారి ఆస్పత్రికి వెళ్లాడు బాధితుడు. స్కాన్ చేసి కొత్త సమస్యను గుర్తించిన వైద్యులు.. మే 12న మరోసారి శస్త్రచికిత్స చేశారు.
ఇటీవల కడుపునొప్పి తిరగబెట్టగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు పాల్. అల్ట్రా స్కాన్ చేసిన వైద్యులు.. అతడి కడుపులో దాగి ఉన్న రెండు కత్తెరలను గుర్తించారు. మునుపటి ఆపరేషన్ సమయంలో వీటిని మర్చిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గతవారమే శస్త్రచికిత్స చేసి అతడి పొత్తి కడుపులోని కత్తెర్లను తొలగించారు.
సీఎంకు ఫిర్యాదు..
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు జోసెఫ్.. వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రాష్ట్ర సీఎం, ఆరోగ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో బాధితుల ఫ్లాష్ మాబ్!