కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ పతనం ఖాయమా...? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ప్రశ్నకు ఔననే సమాధానం బలంగా వినిపిస్తోంది.
సుప్రీం కీలక తీర్పు....
శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రాజీనామాలు ఆమోదించాలన్న అభ్యర్థనపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినా.... బలపరీక్షకు ముందు రెబల్స్‌కు ఉపకరించేలా కీలక ఆదేశాలిచ్చింది. గురువారం బలపరీక్షకు హాజరుకావాలా లేదా అనే అంశంపై రెబల్ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. బలపరీక్షకు రావాల్సిందిగా వారిని ఎవరూ బలవంతం చేయరాదని సూచించింది. కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పటికే జారీ చేసిన మూడు లైన్ల విప్ చెల్లదని తేల్చిచెప్పింది.
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడాన్ని స్పీకర్ ఇష్టానికి వదిలేసింది సుప్రీంకోర్టు. ఇందుకు నిర్ణీత గడువు ఏదీ లేదని తేల్చిచెప్పింది. స్పీకర్ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఏం జరుగుతుంది..?
గురువారం ఉదయం 11 గంటలకు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది. సుప్రీం తీర్పును బట్టి... రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాల్సిన అవసరం లేదు. ఫలితంగా... అధికారంలో కొనసాగేందుకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేకుండా పోతుంది. కుమారస్వామి సర్కారు బలపరీక్షలో ఓడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రెబల్స్ రాజీనామాలను స్పీకర్ ఇప్పటికిప్పుడు ఆమోదించినా అదే పరిస్థితి.
లెక్కల చిక్కులు...
కర్ణాటకలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 224. అధికారంలో కొనసాగేందుకు కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం.
సంక్షోభానికి ముందు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 118. భాజపా బలం 105.
కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్వతంత్ర సభ్యులు మరో ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.
బలపరీక్షకు ముందు జరిగే రెండు కీలక పరిణామాలకు అవకాశాలు ఉన్నాయి....
1. రాజీనామాలు ఆమోదిస్తే...
16 మంది రాజీనామా లేఖలు సమర్పించినా... సుప్రీంకోర్టును 15 మంది అసంతృప్తులే ఆశ్రయించారు. ఆ 15 మంది రాజీనామాలను స్పీకర్ బలపరీక్షకు ముందే ఆమోదిస్తే... కర్ణాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. ప్రభుత్వం కొనసాగేందుకు కనీసం 105 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ సంఖ్యా బలం కుమారస్వామి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే అవకాశం లేదు. భాజపాకు మాత్రం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
2. రాజీనామాలు ఆమోదించకపోతే...
రాజీనామాలు ఆమోదించకపోతే.... 15 మంది రెబల్స్ శాసనసభకు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా... సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అధికారంలో కొనసాగేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను పొందడంలో స్వామి సర్కారు విఫలమవుతుంది.