నిర్భయ కేసు దోషి ముకేశ్‌కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది.
నిర్ణయం ప్రకటించే సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ముందు ఉంచిందని స్పష్టంచేసింది. జైలులో ముకేశ్ వేధింపులకు గురయ్యాడన్న వాదన.... క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేయడానికి ఆధారం కాదని తేల్చిచెప్పింది. క్షమాభిక్ష అభ్యర్థనపై రాష్ట్రపతి వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. త్వరితగతిన ప్రక్రియ పూర్తయినంత మాత్రాన రాష్ట్రపతి సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని అనడం తగదని హితవు పలికింది. ముకేశ్ తరఫు న్యాయవాది మంగళవారం వాదనలు సందర్భంగా చేసిన వేర్వేరు ఆరోపణల్ని తోసిపుచ్చుతూ నేడు ఈమేరకు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. మరో దోషి అక్షయ్ తాజాగా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకున్నాక... ఉరిశిక్ష విధింపుపై మరింత స్పష్టత రానుంది.