యావత్ ప్రపంచం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలపై భారత్ స్పందించింది. ఇరు దేశాల మధ్య ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికాలో చాలా బలమైన మద్దతు ఉందని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు ప్రభావితం కావని అభిప్రాయం వ్యక్తం చేసింది.
భారత్ కూడా ...
'భారత్ కూడా అమెరికా ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది' అని భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు భారత్-అమెరికా సంబంధాల మీద ప్రభావం చూపుతాయా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికాలో దృఢమైన మద్దతు ఉంది. క్రమానుగతంగా వచ్చే అధ్యక్షుల పరిపాలనలో ఇరు దేశాల సంబంధాల స్థాయిని మరింత పెంచింది' అని ఉద్ఘాటించారు.
"ఇరు దేశాల సంబంధాలకు బలమైన పునాదులు పడ్డాయి. మా సంబంధాలు సాధ్యమైన ప్రతి రంగంలోనూ సహకారాన్ని కలిగి ఉంటాయి. వ్యూహాత్మక అంశాల నుంచి రక్షణ వరకు, పెట్టుబడి నుంచి వాణిజ్యం, ప్రజా సంబంధాల వరకు విస్తరించి ఉన్నాయి."
- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ ప్రతినిధి
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ప్రధానంగా రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇండో-ఫసిపిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య పోరులో భారత్కు మద్దతుగా నిలించింది అమెరికా.
ఇదీ చూడండి: 'భారత వాయుసేన వల్లే దూకుడు తగ్గించిన చైనా'