జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఈ కారణంగా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు మాలిక్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తాను అలాంటి వ్యాఖ్యలు చేసుండకూడదని... అవి కేవలం ఆగ్రహంతో అన్న మాటలేనని తెలిపారు.
అమాయక ప్రజలను చంపడం మాని... ఎన్నో ఏళ్లుగా కశ్మీరీల సంపదను కొల్లగొడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని సత్యపాల్ మాలిక్ ఆదివారం ఉగ్రవాదులకు సూచించారు.
"తుపాకులు పట్టుకుంటున్న యువకులు వారి సొంత ప్రజలనే చంపుతున్నారు. పోలీసులను హతమారుస్తున్నారు. బలగాలను ఎందుకు చంపడం? కశ్మీరీల సొమ్మును కొల్లగొడుతున్న వారిని చంపండి. ఇప్పటివరకు అలాంటి వారిని కాల్చిచంపారా?"
--- సత్యపాల్ మాలిక్, జమ్ము గవర్నర్.
సర్వత్రా విమర్శలు...
గవర్నర్ వ్యాఖ్యలకు ఘాటు సమాధానమిచ్చారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా. దిల్లీలో తన ప్రతిష్ఠను గవర్నర్ తనిఖీ చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న మాలిక్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఒమర్. గవర్నర్ ట్వీట్‌ను దాచాలని.. అధికారులు, నేతలు హత్యకు గురైతే అది కేవలం మాలిక్ ఆదేశాల వల్లేనని విమర్శించారు.
ఆటవిక రాజ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారా అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మీర్ గవర్నర్‌ను ప్రశ్నించారు. తుపాకుల సంస్కృతి కశ్మీర్‌ను ఎప్పుడూ రక్షించలేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: నేడే బలపరీక్ష-సర్వత్రా ఉత్కంఠ