దేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిపై స్పందించారు మజీ ప్రధాని మన్మోహన్ సింగ్. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో మోదీ ప్రభుత్వం విఫలమైనందునే దేశానికి ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. భాజపా సర్కార్ విధానాలతోనే నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, ఉత్పాదక రంగం వృద్ధి రేటు 0.6 శాతం వద్ద కదలాడుతుండటం ఎంతో బాధాకరమైన అంశమని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులు మందకొడిగా సాగుతుండటం ఆర్థిక పునరుద్ధరణకు శుభసూచకం కాదని అభిప్రాయపడ్డారు మన్మోహన్.
" దేశ ప్రస్తుత ఆర్థిక స్థితి ఎంతో ఆందోళన కలిగించే విషయం. దీర్ఘకాల ఆర్థిక మందగమనానికి మధ్యలో ఉన్నామని గత త్రైమాసికంలో నమోదైన 5 శాతం జీడీపీ సూచిస్తోంది. అర్థికంగా అత్యంత వేగంగా వృద్ధి చెందగలిగే సత్తా భారత్కు ఉంది. అయితే, మోదీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతోనే ఆర్థిక స్థితి మరింత మందగించింది. ఈ పరిస్థితిని కొనసాగించే శక్తి దేశానికి లేదు. అందుకే, మానవ తప్పిదం వల్ల నెలకొన్న ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రతీకార రాజకీయాలను పక్కనబెట్టి, మేధావుల సలహాలు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా."
-మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని