శ్రీనగర్‌కు దక్షిణాన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాంపోర్ నగరం.. దాని చుట్టుపక్కల గ్రామాలు చూసేందుకు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఈ పీఠభూముల్లో ప్రపంచంలోనే అత్యంత అమూల్యమైన మసాలా దినుసు.. కుంకుమపువ్వును ఇక్కడ పండిస్తారు.
"కుంకుమపువ్వు కశ్మీర్‌కే కాదు... ముఖ్యంగా పాంపోర్‌కు తరగని శోభ తెచ్చిపెట్టే అంశం."
- జావేద్ అహ్మద్ భట్, కుంకుమపువ్వు రైతు
కశ్మీర్ అందాల్లో ప్రత్యేకం
ఎండిన నేలపై దట్టంగా పరుచుకున్న పూలు.. వరి పొలాలతో, పచ్చదనంతో కళకళలాడే కశ్మీరీ ప్రకృతి అందాల నుంచి దృష్టిని తమవైపు మరల్చుకుంటాయి. కశ్మీర్ సందర్శనకు వచ్చే ప్రతి పర్యాటకుడూ స్థానిక మార్కెట్ల నుంచి కుంకుమపువ్వు కొనకుండా తిరిగి వెళ్లడు. కొందరైతే ప్రత్యేకంగా పాంపోర్ను సందర్శిస్తారు. ఇక్కడి ప్రజలు కొన్ని శతాబ్దాలుగా కుంకుమపువ్వు సాగు చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇదే వారికి ఆధారం. స్థానికుల దైనందిన జీవితంలోనే కాదు.. కశ్మీర్ చరిత్రలో కుంకుమపువ్వుకు ప్రత్యేక స్థానముంది. కుంకుమపువ్వు లేకుండా ప్రఖ్యాత వజ్వాన్ ఉత్సవం, కవా పానీయాలను ఊహించుకోలేం. అయితే.. కొన్ని దశాబ్దాలుగా కుంకుమ పువ్వు సాగు, రైతులకు కష్టతరంగా మారింది. కొందరు ఆశలు వదులుకుని, వేరే బతుకుదెరువు వెతుక్కున్నారు. ఈ నేపథ్యంలో.. కుంకుమపువ్వు సాగుకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
"ఇరవయ్యేళ్ల క్రితం వరకూ ష్కలమైన దిగుబడి వచ్చేది. దాంతో ఇక్కడివాళ్లంతా ఉల్లాసంగా ఉండేవారు. కొంతకాలంగా దిగుబడి తగ్గుతోంది."
- జావేద్ అహ్మద్ భట్, కుంకుమపువ్వు రైతు
17లక్షల పూలకు ఒక కిలో..
కుంకుమపువ్వుకు మార్కెట్లో మంచి విలువ ఉంటుంది. క్రోకిన్, పిక్రోక్రోకిన్, సాఫ్రనల్ లాంటి మూలకాల వల్ల ఔషధ రంగంలో దీనికి డిమాండ్ ఎక్కువ. పర్ఫ్యూమ్స్, రంగుల అద్దకం, సౌందర్య ఉత్పత్తులలోనూ కుంకుమపువ్వు వాడతారు. ఈ సాగు చాలా ప్రత్యేకం. 17 లక్షల పూలు ఎండబెడితే.. ఒక కిలో కుంకుమపువ్వు ఉత్పత్తవుతుంది. 2020లో మొదటిసారిగా కుంకుమపువ్వుకు భౌగోళిక గుర్తింపు.. జీఐ ట్యాగ్ దక్కింది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలకు శాఫ్రన్ ఉత్పత్తిలో గట్టి పోటీగా నిలిచేందుకు జీఐ ట్యాగ్ ఉపయోగపడుతుంది.
"జీఐ ట్యాగింగ్ తెప్పించేందుకు ప్రభుత్వం చాలా కష్టపడింది. ఎట్టకేలకు అది దక్కింది. కుంకుమ పువ్వు కశ్మీర్లో పుట్టింది అన్న గుర్తింపును ఈ జీఐ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కోరుకునే బ్రాండ్, లోగోతో పాటు నాణ్యమైనదే అన్న భరోసాను ఈ ట్యాగ్ ఇస్తుంది."
- అల్తాఫ్ ఐజాజ్ అంద్రాబీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్, కశ్మీర్
శాఫ్రన్ మిషన్ కూడా..
జీఐ ట్యాగింగ్‌తో పాటు జాతీయ శాఫ్రన్ మిషన్ కూడా పూర్తవనుంది. కుంకుమపువ్వు సాగుకు నూతన జీవం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం 2010లో ఈ కార్యక్రమం ప్రారంభించింది.
"ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కుంకుమపువ్వుకు జీఐ ట్యాగ్ ఉండదు. కుంకుమ పువ్వును అధిక మొత్తంలో ఉత్పత్తి చేసే ఇరాన్, మొరాకో, అజార్బైజన్, గ్రీస్ లాంటి దేశాలకు ఈ ట్యాగ్ లేదు. మన కుంకుమపువ్వు సమశీతోష్ణ ప్రాంతాల్లో ఉత్పత్తవుతుంది. ఇదే అత్యుత్తమమైనది."
- అల్తాఫ్ ఐజాజ్ అంద్రాబీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్, కశ్మీర్
చరిత్ర తిరగరాసేందుకు..
ప్రస్తుతం 3,700 హెక్టార్ల భూమిలో కుంకుమపువ్వు సాగవుతోంది. 2018లో 5 నుంచి 6 టన్నుల శాఫ్రన్ ఉత్పత్తయింది. మరుసటి ఏడాదికి పంట 3 రెట్లు పెరిగింది. ఈ సాగు చాలా సున్నితం. గాలిపాటులో వచ్చే చిన్న మార్పైనా పంటను దెబ్బతీస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో జల్లులు కురిస్తే, అక్టోబర్లో పూలు పూర్తిగా విచ్చుకుంటాయి. తుంపర సేద్యం వచ్చిన తర్వాత పూర్తిగా వరుణుడిపై ఆధారపడే పరిస్థితి మాయమైంది. పంటను కాపాడుకునేందుకు రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఏదేమైనా శతాబ్దాల చరిత్రను తిరగరాసేందుకు కశ్మీరీ కుంకుమపువ్వు రంగం సిద్ధంగా ఉంది.
ఇదీ చదవండి: ఎడారి రాష్ట్రంలో 'కుంకుమ' సిరులు