హ్యూస్టన్లో ప్రవాస భారతీయులు ఆదివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో 'అంతా బాగుంది' అని తెలుగుతో పాటు వివిధ భాషల్లో అన్నారు మోదీ. ప్రధాని డైలాగ్పై కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ కుటుంబ సభ్యుల సాయంతో ట్వీట్ చేశారు.
"భారత్లో నిరుద్యోగం, ఉద్యోగాల కోత, తక్కువ వేతనాలు, మూక దాడులు, కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం, విపక్ష నేతలను జైలుకు పంపటం మినహా అంతా బాగుంది. "
-పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి.
తిహార్ జైలుకు సోనియా, మన్మోహన్...
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో జుడిషీయల్ రిమాండ్‌లో ఉన్న చిదంబరంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనపై ఉన్న కేసులో రాజకీయంగా పోరాడేందుకు పార్టీ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు సోనియా.
కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నారు. సోనియా, మన్మోహన్లకు కృతజ్ఞతలు తెలిపారు కార్తీ.
కాంగ్రెస్ బలంగా ఉంది..
అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తనను కలిసేందుకు జైలుకు రావటం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు చిదంబరం. కాంగ్రెస్తో పాటు తానూ బలంగా, ధైర్యంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి తిహార్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు చిదంబరం.
ఇదీ చూడండి: ఆయన భార్యకు మోదీ ఎందుకు సారీ చెప్పారంటే..