కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఆమె... హరియాణా శాసనసభ ఎన్నికల కోసం హస్తం పార్టీ తరఫున నేడు ప్రచారం చేయనున్నారు.
మహేంద్రగఢ్లోని ప్రభుత్వ కళాశాల క్రీడా ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు సోనియా. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, హరియాణా కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు గులాం నబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారి సెల్జా, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరుకానున్నారు.
దేశంలో భాజపా అనుకూల పవనాలు బలంగా వీస్తున్న ప్రస్తుత తరుణంలో హరియాణా, మహారాష్ట్రల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే మహారాష్ట్ర, హరియాణాల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సోనియా తనయుడు రాహుల్ గాంధీ పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్ 21న జరగనున్న ఎన్నికల కోసం రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
అయితే... కొంత కాలంగా ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్న సోనియా స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017 ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల సమయంలో అస్వస్థతకు గురైన సోనియా... కొద్ది కాలం ప్రచారాల్లో పాల్గొనలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికీ దూరంగానే ఉన్నారు.