ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై సుదీర్ఘ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా. ఈవీఎంలలో ఏదో తప్పు ఉందని అభిప్రాయపడ్డారీ టెక్నోక్రాట్ టర్న్డ్ పొలిటిషియన్.
ప్రస్తుతం అందులో ఏ దోషం ఉందో సరైన కారణాన్ని చూపలేకపోయారు పిట్రోడా. కానీ.. ఆయనకు ఈవీఎం యంత్రం ఇస్తే.. తప్పేంటే అధ్యయనం చేస్తానని ప్రకటించారు.
"ఒక ఇంజినీర్‌గా, సాంకేతిక నిపుణుడిగా ఈవీఎంలతో నేను సంతృప్తి చెందట్లేదు. కానీ వాటిని నిందించలేను ఎందుకంటే నా దగ్గర ఈవీఎం మిషన్ లేదు. ఒక వేళ ఎవరైనా ఈవీఎంను అధ్యయనం చేయడానికి ఏడాది పాటు ఇస్తే అప్పుడు నేను ఏదైనా మాట్లాడతా. మీరు దాని ఆకృతి, సాఫ్ట్‌వేర్‌ను అర్థం చేసుకోగలరు.. .కానీ ఒకటి మాత్రం నిజం... అందులో ఏదో తప్పు ఉంది. కానీ.. అది మనకు తెలియదు."
- సామ్ పిట్రోడా, కాంగ్రెస్ నాయకుడు
ప్రతిపక్ష పార్టీలు ఇటీవలే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని డిమాండ్ చేశాయి.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతిపాదించిన న్యాయ్ పథకం ప్రపంచ వ్యాప్తంగా నిపుణులను సంప్రదించి రూపొందించారని పేర్కొన్నారు పిట్రోడా. దేశంలోని 50 మిలియన్ల నిరుపేదలను ఆదుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఇదీ చూడండీ: సార్వత్రిక రెండో దశలో 66 శాతం పోలింగ్