గ్రామాలే పెద్దపీటగా ఉన్న భారతదేశంలో పశు సంపదకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పశువుల్లో వ్యాధులను అరికట్టేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఉత్తర్ప్రదేశ్ మథురలో ప్రారంభించారు ఆయన.
విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మోదీ. ఓం, ఆవు పేర్లు చెబితే వారు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు.
"ఆఫ్రికాలో రువాండా అనే దేశం ఉంది. అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. అక్కడి ప్రభుత్వం రువాండలోని గ్రామాలకు ఆవులను అందిస్తుంది. అయితే ఆ ఆవుకు పుట్టబోయే మొదటి ఆడ లేగదూడను ప్రభుత్వం తీసుకునేలా ఒక నియమం ఉంది. ఆ దూడను ఆవులేని మరొక కుటుంబానికి అందిస్తుంది. ఈ పద్ధతి ఇలా కొనసాగుతూ ఉంటుంది.
కానీ... మన దేశంలో మాత్రం దురదృష్టకర పరిస్థితి ఉంది. 'ఓం', 'ఆవు' అనే పదాలు వినిపించగానే కొందరు ఉలిక్కిపడతారు. దేశం 16-17వ శతాబ్దంలోకి వెళ్లిపోయినట్టు భావిస్తారు. దేశాన్ని భ్రష్టుపట్టించాలని కంకణం కట్టుకుని, అందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని వ్యక్తులే ఇలాంటి జ్ఞానం కలిగి ఉంటారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి