నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన (ఎగ్జిబిషన్)లోని కొన్ని స్మారకాల వాస్తవికతను ఆయన మనుమడు సుగత బోస్ ప్రశ్నించారు. కోల్‌కతాకు చెందిన నేతాజీ రీసెర్చి బ్యూరో (ఎన్‌ఆర్‌బీ) అధ్యక్షుడు అయిన ఆయన ఈ మేరకు విక్టోరియా మెమోరియల్ క్యూరేటర్ జయంత సేన్‌గుప్తకు లేఖ రాశారు. నేతాజీ అప్పట్లో ఇండియన్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేస్తూ రాసిన లేఖ విషయాన్ని సుగత బోస్ ప్రస్తావించారు. ఈ లేఖకు సంబంధించిన ప్రతిని మ్యూజియమ్ నిర్వాహకులు ఎప్పుడూ ఎన్‌ఆర్‌బీని అడగలేదని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రదర్శనలో ఉంచిన 'నకిలీ లేఖ ప్రతి'ని తక్షణం తీసేయాలని కోరారు. నాటి నేతాజీ రాజీనామా లేఖ ఫొటోప్రతి 50 ఏళ్లకు పైగా ఎన్‌ఆర్‌బీ వద్ద ఉన్నట్లు తెలిపారు. "ఈ లేఖ లేదా మరేదైనా మీకు మేం నేరుగా ఇవ్వలేదు. దేశ ప్రధాని ప్రారంభించిన ఈ ప్రదర్శనలో నకిలీ స్మారకాన్ని ఉంచారు. ఇది ఎవరు తెచ్చారో విచారణ జరపండి" అని సుగత బోస్ కోరారు. మరికొన్ని ఫొటోలు కూడా నకిలివేనంటూ వాటి గురించి ప్రస్తావించారు. ఎగ్జిబిషన్ కోసం విక్టోరియా మెమోరియల్ ఎన్నడూ ఎన్‌ఆర్‌బీని సంప్రదించలేదని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన నిర్వహించడం పట్ల కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక గొప్ప నేతకు గౌరవం ఇచ్చే తీరు ఇది కాదని పేర్కొన్నారు. విక్టోరియా మెమోరియల్ కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలో ఉంది. తన లేఖపై ఇంతవరకు విక్టోరియా మెమోరియల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని సుగత బోస్ 'పీటీఐ'కి తెలిపారు.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్‌లో ప్రళయం- సహాయక చర్యలకు ఆటంకం