ETV Bharat / bharat

గురువులకు సరైన ఒరవడి కరవైందా...? - నిర్దేశిత అర్హతలు

దేశంలో  గొప్ప పేరు, ప్రఖ్యాతలు పొందిన వారి జీవితాల్లో మలుపులన్నీ పాఠశాలల నుంచే మొదలయ్యాయి. మరి అలాంటి గురుకులంలో నేటి తరం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే గురువులకు సరైన నైపుణ్యాలు కొరవడటం బాధాకరం. దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా పాఠశాలలు ఉన్నా, విద్యా రంగంలో ఇప్పటికీ  భారతదేశం 50 సంవత్సరాలు వెనకే ఉన్నట్లు యునెస్కో అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు నిర్ణీత మెళకువలు అందించడానికి కేంద్ర మానవ వనరుల శాఖ బృహత్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

గురువులకు సరైన ఒరవడి కరువయ్యిందా?
author img

By

Published : Aug 23, 2019, 5:11 PM IST

Updated : Sep 28, 2019, 12:26 AM IST

దక్షత కలిగిన ఉపాధ్యాయుడు- లక్షలాది జ్ఞానదీపాల్ని వెలిగించగల దీప్తిశిఖ. అంతకుమించి, అసంఖ్యాక శిష్యుల్ని సవ్య జీవనపథంలోకి మళ్లించగల అద్భుత చేతన! ఏ దేశ భవితవ్యమైనా తరగతి గదిలోనే రూపుదిద్దుకొంటుందన్నది ఎంత నిజమో, రేపటి పౌరుల్ని జాతివజ్రాలుగా సానపట్టాల్సింది గురువులేనన్నదీ అంతే సత్యం. పాఠశాలల్లో మేలిమి బోధన ఒనగూడేందుకు ఉపాధ్యాయులు శిక్షణ పొంది తీరాల్సిందేనంటూ విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించిన రెండేళ్ల తరవాతా కంతలు వెక్కిరిస్తున్నాయి.

ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమే..

ఈ తరుణంలో, దేశవ్యాప్తంగా సుమారు 42లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించడానికి ఉద్దేశించిన బృహత్‌ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఎన్నదగ్గ చొరవ కనబరచింది. బోధన సిబ్బందికి మెలకువలు అలవరచి, విద్యార్థులకు మెరుగైన పాఠాలు అందించడమే లక్ష్యంగా రూపొందిన ‘నిష్ఠ’కు రెండంచెల శిక్షణ బృందాలు అత్యంత కీలకమంటున్నారు.

ఎన్‌సీఈఆర్‌టీ (జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి), ఎన్‌ఐఈపీఏ (జాతీయ విద్యా ప్రణాళిక పాలన సంస్థ), కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌, నవోదయ విద్యాలయ సమితి తదితరాలనుంచి ఎంపికైన 120మంది నిష్ణాతులు రాష్ట్రస్థాయిలో 33,120 మందికి ఒరవడి దిద్దేలా పథకం రచించారు. వారు దేశం నలుమూలలా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, సారథులతోపాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌ స్థాయి విద్యాశిక్షణ సంస్థల సిబ్బందికి సమన్వయకర్తలకు నిర్ణీత మెలకువలు అలవరచాల్సి ఉంటుంది.

విద్యాపరమైన క్రీడలు, ప్రహేళికలు, స్ఫూర్తిదాయక భేటీల రూపేణా ఈ భూరి శిక్షణ కసరత్తు కదం తొక్కాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అభిలషిస్తోంది. ఈ ఏర్పాటుతోనే లక్షలాది ఉపాధ్యాయులకు ప్రామాణిక శిక్షణ ఒంటపడుతుందా? ప్రాథమిక విద్యాబోధనలో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న దేశాల అనుభవాలనుంచి విలువైన పాఠాలు స్వీకరించే యత్నం అసలు జరిగిందా?

విద్యారంగంలో ఇప్పటికీ యాభై ఏళ్లు వెనకే

దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా పాఠశాలలతో ప్రాథమిక విద్యారంగం కంటికి నదరుగా కనిపిస్తున్నా- బడి చదువుల ప్రమాణాల పరంగా ఇండియా యాభై సంవత్సరాలు వెనకబడి ఉందని యునెస్కో అధ్యయన పత్రం మూడేళ్ల క్రితం నిగ్గుతేల్చింది. మౌలిక వసతులు మొదలు బోధన సిబ్బంది వరకు అన్నింటా లోటుపాట్లను అది సూటిగా తప్పుపట్టింది. వెతికి పట్టుకోవాలే గాని ప్రతి తరగతి గదిలో ఓ సీవీ రామన్‌, జగదీశ్‌ చంద్రబోస్‌, హర్‌గోవింద్‌ ఖొరానా దొరుకుతారన్న ఉద్ఘాటనలతో మోతెక్కించిన పాలకులు సార్వత్రిక ఉచిత నిర్బంధ విద్యాచట్టం తెచ్చినా ఒరిగిందేమీ లేదు! దేశంలో ఉపాధ్యాయ విద్యావిధానం ఏ తీరుగా ఉండాలో కొఠారీ కమిషన్‌, ఛటోపాధ్యాయ కమిటీ, యశ్‌పాల్‌ కమిటీ వంటివి ఎన్నో హితవు పలికినా- గురుబ్రహ్మలను తీర్చిదిద్దాల్సిన కర్తవ్య పాలన ప్రభుత్వాలకు పరగడుపున పడిపోయింది. ప్రాథమిక స్థాయి బోధన సిబ్బందిలో దాదాపు 11 లక్షల మంది ప్రామాణిక అర్హతలు, శిక్షణ లేనివారేనన్న రాష్ట్ర ప్రభుత్వాల ప్రమాణపత్రాలు పరిస్థితి తీవ్రతను ప్రస్ఫుటీకరించాకనే- మోదీ తొలి దఫా ఏలుబడిలో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.

నిర్దేశిత అర్హతలు లేవు

మహారాష్ట్రలో మూడొంతులకు పైగా, బిహార్‌లో 72 శాతం, అసోమ్‌లో 64 శాతం మేర ప్రాథమిక పాఠశాలల్లో గురువులకు నిర్దేశిత అర్హతలు లేనేలేవన్నది దిగ్భ్రాంతపరచే యథార్థం. సహజంగానే ఇది ప్రమాణాల్ని కుళ్లబొడిచి పునాది చదువుల్ని గుల్లబారుస్తోంది. ఈ దుస్థితికి విరుగుడుగా అత్యుత్తమ ఉపాధ్యాయ విద్య అందించే ప్రత్యేక సంస్థ అవతరించాలన్న సిఫార్సుల వెలుగులో ఇన్నాళ్లకు ‘నిష్ఠ’ పట్టాలకు ఎక్కుతోంది. అన్నివిధాలా యోగ్యుడైన గురువే శిష్యుల ఆసక్తి, సహజ బలిమిని గుర్తెరిగి వారి భవిష్యత్తుకు వన్నెలద్దగలిగేది. ఆ తరహాలో ఉపాధ్యాయుల్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం సకలవిధ జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది!

ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యుత్తమ విద్యా వ్యవస్థ సాధ్యం ఎలా?

ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన ప్రాథమిక విద్య గరపడంలో ఫిన్లాండ్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా ప్రభృత దేశాలు పోటీపడుతూ మానవ వనరులకు పదును పెట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు బోధన సిబ్బంది వృత్తి నైపుణ్యాలకు వన్నెలద్దడానికి అగ్ర ప్రాధాన్యమిస్తున్న జపాన్‌, జర్మనీ, చైనా వంటివి బాధ్యతాయుత జాతి నిర్మాణానికి తమదైన భాష్యం చెబుతున్నాయి. వైద్య నిపుణులతో సమానంగా ఉపాధ్యాయులకు వేతనాలు, నిరంతర శిక్షణలు, పరీక్షలతో వారిని పోనుపోను మరింత రాటుతేలుస్తుండటమే- వాటి విజయ రహస్యం!

ఫిన్లాండ్​ జనాభా కంటే భారత్​లోని ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ

దేశంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల సంఖ్య 85 లక్షలని, అది ఫిన్లాండ్‌ మొత్తం జనాభాకన్నా అధికమంటున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ- గురువుల సమస్యల్ని చక్కదిద్ది వారి సంక్షేమంపై దృష్టి పెట్టడమే అభిమతమంటోంది. 2030 సంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఈడీ కోర్సులు అందుబాటులోకి తేవడం ద్వారా ఉపాధ్యాయ విద్యలో సమూల మార్పులు లక్షిస్తున్న కేంద్రం, క్షేత్రస్థాయి స్థితిగతుల్ని ఆకళించుకుని ముందడుగేయాలి. ఖాళీల భర్తీ, నూతన నియామక అవసరాలకు తగ్గట్లు 19వేల ఉపాధ్యాయ శిక్షణ సంస్థల పరిపుష్టీకరణ ఊపందుకోవాలి. లక్ష వరకు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక్కరే అయిదు తరగతుల వారికీ అన్ని సబ్జెక్టులూ బోధించాల్సిన దురవస్థపై వేటువేయాలి. చదువులకు చెదలు పడుతున్నా ఏళ్ల తరబడి పట్టించుకోని ప్రభుత్వాల అలసత్వం మూలాన జాతి ఇప్పటికే భారీగా నష్టపోయింది. అట్టడుగు నుంచీ విద్యాబోధన గాడినపడి, ఉన్నత చదువుల్లోనూ స్థిరమైన మెరుగుదల సాధ్యమైన నాడు- మానవాభివృద్ధి సూచీలో దేశం సగర్వంగా తలెత్తుకోగలుగుతుంది!

ఇదీ చూడండి:రక్షకులను కాటేస్తున్న భక్షకులు

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 12:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.