పూజలు, అలంకరణ కోసం వినియోగించిన పూలు.. వాడి పోయిన తర్వాత చెత్తగా మారి, డంపింగ్‌యార్డును చేరాల్సిందే. పనికిరాని వ్యర్థాల్నే తిరిగి వాడుకోగలిగినప్పుడు.. వాడిన పూలను వాడలేమా అన్న ఆలోచన వచ్చింది విశాఖకు చెందిన కొందరు యువకులకు. గ్రీన్‌వేవ్స్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ అనే సంస్థ ద్వారా తమ ఆలోచనలు ఆచరణలోకి తెచ్చారు.
జీరోవేస్ట్ సూత్రం అమలు..
వడలిన పూలతో సుగంధభరిత అగర్‌బత్తీలు, దూప్‌స్టిక్‌లు, ఇతర ఉత్పత్తులు తయారు చేస్తోంది గ్రీన్‌వేవ్స్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేయాలనే ఆలోచనతో మొదట గ్రీన్ వేవ్స్ స్థాపించారు అనిల్. పర్యావరణహితంగా ఉండాలన్న ఉద్దేశంతో జీరోవేస్ట్ సూత్రాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని దేవాలయాలతో ఒప్పందం చేసుకుని కొబ్బరి కాయలు, పూవ్యర్థాల నుంచి పర్యావరణహిత వస్తువులు తయారుచేస్తున్నారు.
వేటికవి విడదీస్తూ..
అగర్‌బత్తీలకు మాత్రమే పరిమితం కాకుండా సబ్బులు, కొబ్బరిటెంకలతో పాత్రలు, గుండీలు తయారుచేస్తున్నారు. పూలను ఎండబెట్టి, ప్రతిఒక్క భాగాన్నీ వినియోగిస్తున్నారు. విత్తనాలు, ఎరువులకు అనువుగా ఉండే భాగాలు వేరుచేస్తూ, పూవ్యర్థాలను నూరుశాతం ఉపయోగకరంగా మారుస్తున్నారు.
విశాఖ మహానగరపాలక సంస్థ అధికారులు గ్రీన్‌వేవ్స్ ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు. నగరంలో మార్కెట్లు, దేవాలయాలు, వేడుకల నుంచి వచ్చే పూల వ్యర్థాలను ఈ విధంగా వినియోగిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
మంచి ఆదాయం
సామాజిక బాధ్యతతో... చుట్టుపక్కల ప్రాంతాల మహిళలకు పూవ్యర్థాల నుంచి అగర్‌బత్తీల తయారీపై శిక్షణ ఇవ్వనుంది గ్రీన్‌వేవ్స్ సంస్థ. యంత్ర పరికరాల అవసరం లేకుండా చేతితోనే చేయగలిగే అవకాశం ఉన్నందున.. కుటీర పరిశ్రమగా వీటి తయారీ చేపట్టి, మంచి ఆదాయం గడించవచ్చని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: భారత్‌లోనే ఎత్తైన క్లాక్‌టవర్ ఎక్కడుందంటే...