దిల్లీ-హరియాణా సరిహద్దు సింఘులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలో కర్షకులు ఏర్పాటు చేసుకున్న గుడారాలపైకి రాళ్లు విసిరినట్లు సమాచారం. కొన్ని టెంట్లను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఫలితంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
రంగంలోకి పోలీసులు
రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికులను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడం వల్ల లాఠీఛార్జి చేశారు. పరిస్థితి మరీ ఉద్రిక్తంగా మారడం వల్ల బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.
సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది స్థానికులు గురువారమే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఒక్క రోజులో వెళ్లిపోవాలని రైతులకు అల్టిమేటం జారీ చేశారు. అయినా, రైతులు అక్కడే బైఠాయించిన నేపథ్యంలో శుక్రవారం ఆకస్మికంగా ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాలు భేష్- 'దిల్లీ హింస' బాధాకరం'