కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మీడియా సంస్థలపై మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తానే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించినట్లు వచ్చిన కథనాలను ఖండించారు.
"మీడియా... ఇలాంటి తప్పుడు వార్తలను అరికట్టాలని హెచ్చరిస్తున్నా. మరోమారు నా ముందు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం ఇస్తా."
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత
నిజాలు నిలకడగా తెలుస్తాయ్
తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని... అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.
"తిరుగుబాటు ఎమ్మెల్యేలు నాపై నిందలు వేస్తున్నారు. అయితే ఈ వివాదం పరిష్కారం అయ్యాక వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. అపుడు వారు మట్టికరుస్తారు."
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత
విశ్వనాథ్ పంచ్‌లు..
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి... తరువాత రెబల్ ఎమ్మెల్యేగా మారిన ఏ.హెచ్. విశ్వనాథ్... సిద్ధరామయ్యపై తీవ్రవిమర్శలు చేశారు. 'జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ... సిద్ధరామయ్యను ఎంతో నమ్మారు. అయితే తముకూరు నుంచి స్వయంగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ఆయనను ఓడించడానికి సిద్ధరామయ్య పనిచేశారు' అని విశ్వనాథ్ ఆరోపించారు.
ఇదీ చూడండి: సమాచార హక్కుచట్ట సవరణపై రాజ్యసభలో రభస