లాక్డౌన్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక 'శ్రామిక్ రైళ్ల' ద్వారా 63 లక్షల మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు ప్రకటించింది భారతీయ రైల్వే. అన్ని రాష్ట్రాల డిమాండ్లను చేరుకున్నామని, జులై 9న చివరి రైలును నడిపినట్లు వెల్లడించింది. దాదాపు రెండున్నర నెలల కాలంలో మొత్తం 4,165 రైళ్లను నడిపించామని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్.
" చివరి శ్రామిక్ రైలును జులై 9న భారతీయ రైల్వే నడిపించింది. దాని తర్వాతా రైళ్లు కేటాయించాలని మాకు ఎలాంటి డిమాండ్ రాలేదు. అన్ని రాష్ట్రాల డిమాండ్లను తీర్చాం. కానీ, ఇప్పటికీ ఏదైనా రాష్ట్రం నుంచి మరిన్ని రైళ్లు కావాలని డిమాండ్ వస్తే.. నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వరకు 4,165 రైళ్లల్లో 63 లక్షలకుపైగా ప్రయాణికులను తరలించాం."
- వినోద్ కుమార్ యాదవ్, రైల్వే బోర్డు ఛైర్మన్
మే 1న ప్రారంభం..
దేశంలో లాక్డౌన్ విధించిన కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతులు లేక కాలినడకనే స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వలస కార్మికుల కోసం మే1 నుంచి ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ప్రారంభించింది భారతీయ రైల్వే. రాష్ట్రాల డిమాండ్ల మేరకు రైళ్లను కేటాయిస్తూ.. వలస కూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చారు.
ఇదీ చూడండి: శ్రామిక్ రైళ్ల ద్వారా రైల్వేకు 360 కోట్ల ఆదాయం