దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, పర్యటకులు, విద్యార్థుల కోసం 'శ్రామిక ప్రత్యేక రైళ్లు' నడపాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచే వీటిని ప్రారంభించింది కేంద్ర హోంశాఖ. లాక్డౌన్ వల్ల వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు చేరుకునేలా.. రైలు సేవలు వినియోగించుకునేందుకు మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అన్ని జోనల్ మేనేజర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేందుకు అధికారులు స్వయంగా వెళ్లి ఏర్పాట్లను పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని రైల్వే శాఖతో సంప్రదించాలని పేర్కొంది.
కేంద్రం ఆదేశాల్లోని మరిన్ని అంశాలు
- వలస కార్మికులు ఏ రాష్ట్రంలో అయితే వారి ప్రయాణాన్ని మొదలు పెడతారో.. మొదటగా ఆ రాష్ట్రమే వారికి స్క్రీనింగ్ నిర్వహించాలి
- వైరస్ నెగటివ్‌గా వచ్చినవారిని మాత్రమే తమ స్వగ్రామాలకు ప్రయాణించేందుకు అనుమతివ్వాలి
- ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి
- ప్రయాణికులకు ఆహారం, తాగు నీటి సౌకర్యాలను రైలు ఎక్కడైతే ప్రారంభమవుతుందో.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి
- సుదూర ప్రయాణాలు చేసే వారికి జర్నీ మధ్యలో రైల్వే అధికారులు ఆహారం అందిస్తారు
- గమ్యస్థానం చేరుకున్న తర్వాత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. అవసరమైతే క్వారంటైన్ సౌకర్యలు ఏర్పాటు చేయాలి
మొత్తం 6 రైళ్లు...
తొలి శ్రామిక్ రైలు ఈ ఉదయమే 1200 మందితో లింగంపల్లి నుంచి హతియా వెళ్లింది. దీనితోపాటు మరో 5 రైళ్లు నడుపుతోంది రైల్వే శాఖ.