దిల్లీ షాహీన్‌బాగ్ నిరసనల్లో శిశువు మరణంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నిరసనకారుల్లో ఒకరు తమ చిన్నారిని వెంటతెచ్చుకోగా.. తిరిగివెళ్తున్న క్రమంలో శిశువు మరణించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని సుమోటోగా తీసుకుంది.
శిశువు మరణంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నిరసనల్లో పాల్గొన్న పిల్లలను పాకిస్థానీయులు, దేశ వ్యతిరేకులు అంటూ పాఠశాలల్లో ఎగతాళి చేస్తున్నారని ఇద్దరు మహిళా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేస్తూనే... న్యాయవాదులు ప్రధాన సమస్య నుంచి తప్పుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిని పరిగణలోకి తీసుకోమని పేర్కొంది.
సుమోటోగా తీసుకోవడాన్ని కొందరు న్యాయవాదులు వ్యతిరేకించగా.. వారిపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది.
"4 నెలల చిన్నారి అలాంటి నిరసనల్లో పాల్గొనవచ్చా? సమస్యను మరింత జఠిలం చేయడానికి ప్రజలు ఈ వేదికను ఉపయోగించకూడదని మేం భావిస్తున్నాం. మేము సీఏఏ, ఎన్ఆర్సీలను పరిగణించడం లేదు. మేం ఎవరి గొంతు నొక్కడం లేదు. ఇది భారత సుప్రీంకోర్టు సరైన పద్ధతిలో పరిగణించిన సుమోటో."-సుప్రీంకోర్టు
నిరసనల్లో మైనర్లు పాల్గొనకూడదని జాతీయ సాహస బాలల అవార్డు గ్రహీత జెన్ గున్రతన్ సదావర్తి రాసిన లేఖ ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది ధర్మాసనం.