సంచలన సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్‌కు 20వ హత్య కేసులో జీవిత ఖైదు విధించింది కర్ణాటక మంగళూరులో 6వ అదనపు జిల్లా న్యాయస్థానం. 2009లో కేరళ కాసర్గోడ్లో ఓ యువతిని మోసగించి, చంపిన కేసులో ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.
మొత్తం 20 కేసుల్లో 'సైనైడ్ మోహన్' నిందితుడు. ప్రేమ పేరుతో మహిళల్ని బుట్టలో వేసుకోవడం, శారీరక అవసరాలు తీర్చుకున్నాక సైనైడ్ ఇచ్చి చంపడం అతడికి అలవాటు. ఇప్పటికే 19 కేసుల్లో మోహన్ దోషిగా తేలాడు. ఐదు కేసుల్లో మరణశిక్ష సహా.. మూడు కేసుల్లో జీవిత ఖైదు విధించింది కోర్టు. మరో రెండు కేసుల్లో మరణ శిక్ష విధించినా... తర్వాత జీవితఖైదుగా మార్చింది న్యాయస్థానం.
20వ హత్య ఇలా...
కేరళ కాసరగోడ్‌లోని మహిళా వసతి గృహంలో 25 ఏళ్ల యువతి వంటమనిషిగా పనిచేసేది. 2009లో మోహన్ ఆమెకు పరిచయమయ్యాడు. అతడు పెళ్లి చేసుకుంటానన్న మాయమాటలు నమ్మిన ఆ యువతి.. ఏకంగా తల్లిదండ్రులనే కాదనుకుంది. అదే ఏడాది 2009 జులై 8న ఇంటి నుంచి బయటికొచ్చింది. అలా ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చాడు మోహన్.
ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేసిన ప్రతిసారీ తాము పెళ్లి చేసుకున్నామని, త్వరలోనే ఇంటికొస్తామని చెప్పేవాడు మోహన్. అప్పటికే వారి మధ్య ఉన్న చనువుతో శారీరకంగానూ ఒక్కటయ్యారు. గర్భనిరోధక మాత్రల పేరుతో ఒకరోజు ఆమెకు సైనైడ్ పూసిన టాబ్లెట్లు ఇచ్చాడు. ఆమె బెంగళూరు బస్టాండ్‌లోనే స్పృహతప్పి పడిపోగా.. ఓ కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు 2009 అక్టోబర్‌లో నిందితుడ్ని పట్టుకున్నారు.
ఇదీ చూడండి: ప్రజాస్వామ్యానికి సంకెళ్లు! అత్యయిక స్థితికి 45 ఏళ్లు