దేశంలో లౌకికవాదాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. భావసారూప్య పార్టీలతో కలిసి కేంద్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీపీఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన తర్వాత ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఏచూరి.
మీ మ్యానిఫెస్టోలో 3 అంశాలను ప్రముఖంగా పేర్కొన్నారు. భాజపాను ఓడించటం, లోక్సభలో దృఢమైన స్థానం, లౌకిక ప్రభుత్వ ఏర్పాటు. మీరు వీటిని ఎలా సాధిస్తారు?
భాజపా వ్యతిరేక ఓటును మేం సాధిస్తాం. మేం ప్రజలను నేరుగా కోరతాం. ప్రధాని, భాజపా, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటున్నాం. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాలను ధ్వంసం చేసింది. దేశంలో లౌకికవాదాన్ని కాపాడాలి. లౌకిక తత్వాన్ని భాజపా మతవాదం పూర్తిగా నాశనం చేసింది. దేశ సంపదను భాజపా దోచుకుంది.
ముందు బాలాకోట్, ఇప్పుడు అంతరిక్ష ప్రయోగం. ఈ విజయాలను మోదీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందా?
వాళ్లు ఈ విషయాలను రాజకీయం చేస్తున్నారు. శాస్త్రవేత్తల విజయాలు వారి వల్లే సాధ్యమయ్యాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భూమి దాటి అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రధాని ఇక అక్కడే ఉంటే బాగుంటుంది.
భాజపాను ఓడించి భావసారూప్య పార్టీలతో కలిసి లౌకిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా?
జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎన్నికల ముందే పొత్తులు కుదరవు. ఎప్పుడూ అలా జరగలేదు. ఈ రోజు మోదీ 32 పార్టీలతో రాష్ట్రస్థాయిలో పొత్తులు పెట్టుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నుంచి చూస్తే.. ఎన్నికల తర్వాత పొత్తులతో జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల తర్వాతే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేవెగౌడ ప్రధాని అయ్యారు. వాజ్పేయీ ప్రధాని అయినప్పుడు కూడా ఎన్నికల తర్వాతే ఎన్డీఏ ఏర్పడింది. 2004లో మన్మోహన్ సింగ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాకే యూపీఏ ఏర్పడింది. 2019లోనూ అదే పునరావృతం కానుంది.
ఇవీ చూడండి: