లోక్సభలో మహిళా పార్లమెంటు సభ్యులపై భద్రతా సిబ్బంది దౌర్జన్యం చేశారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటున వ్యతిరేకిస్తూ వెల్లోకి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
"మహిళా ఎంపీలపై భద్రతా సిబ్బంది దౌర్జన్యం చేశారు. పార్లమెంటులో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇందుకు కారణమైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాం."
-అధీర్ రంజన్ చౌదురి, కాంగ్రెస్ నేత
అయితే సభలో కాంగ్రెస్ నిరసనలపై భాజపా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అన్ని పార్టీలు కలిసి సభ మర్యాద, సంస్కృతిని కాపాడాల్సి ఉంది. కానీ ఈరోజు రెండు సభల్లో జరిగిన దానిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు నేతలు చేసిన చర్యలకు ఆ పార్టీ మద్దతు ఇవ్వటం దురదృష్టకరం. మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా-శివసేనకు మెజారిటీ వచ్చింది. కానీ 30 ఏళ్ల స్నేహాన్ని స్వార్థం, అవకాశవాదం కోసం వదిలేసింది. అలాంటి శివసేనను అక్కున చేర్చుకుంది కాంగ్రెస్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఎవరు? కాంగ్రెస్ మాత్రమే."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి
ఇదీ చూడండి: 'ఆపరేషన్ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్