దేశంలో వరుస ఉగ్రదాడుల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉగ్రదాడికి అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఉగ్రవాదులు కారు బాంబులతో దాడికి యత్నించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు స్థానిక పోలీసులను హెచ్చరించాయి. పుల్వామా దాడి జరిపిన రీతిలోనే ఐఈడీలతో ప్రణాళికలు రచిస్తున్నట్లు సంకేతాలు అందాయి.
పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు... లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ముఠాకు ఈ పని అప్పగించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ సాయంతో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్‌లు ఇటీవల పుల్వామాలో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల కార్యకలాపాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
జేఈఎం, ఎల్ఈటీల భాగస్వామ్యం...
ఇందులో భాగంగా జాతీయ రహదారి వెంట దాడులకు జేఈఎం, అంతర్గత భద్రతా సంస్థాపనలపై దాడులు చేయాలని లష్కర్ తోయిబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. కశ్మీర్లో సోమవారం ఉదయం ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఏకే 47 రైఫిళ్లు, భారీగా మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల దిల్లీలో జైషే ముఠా చొరబడిందన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వారం కిందట జమ్ముకశ్మీర్ బారాముల్లాలో పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకొని.. ఓ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు