భారత్, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య లద్దాఖ్‌లో చైనా బలగాల మోహరింపుపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదక సమర్పించాయి భారత భద్రత దళాలు. ఆ ప్రాంతంలోకి ఏ విధంగా భారీ సంఖ్యలో బలగాలను తరలించగలిగిందనే విషయాన్ని నివేదికలో వివరించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి దౌలత్ బెగ్ ఓల్డీ, పాంగోంగ్ తో సహా వివిధ సెక్టార్లలో చైనా బలగాల తరలింపుపై పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి వెల్లడించాయి.
చైనా బలగాలు ఇంత వేగంగా ఎలా మోహరించగలిగిందనే అంశపై భారత భద్రత దళాలకు ప్రభుత్వం కూడా పలు విషయాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు అధికారులు.
5వేల మంది మోహరింపు..
ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొన్న తర్వాత మే తొలివారంలో ఈశాన్య లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి సుమారు 5 వేల మందికిపైగా సైనికులను మోహరించింది చైనా. ఒక్కసారిగా భారీగా బలగాలను తరలించటం ద్వారా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే.. భారత్ కూడా అదే స్థాయిలో బలగాలను మోహరించి దీటైన జవాబు పంపింది. భారత సౌర్వభౌమత్వం విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది.
జూన్ 6న మిలిటరీ స్థాయి చర్చలు..
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని ఇప్పటికే ఇరు దేశాలు ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు చేపట్టనున్నట్లు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 6న శనివారం ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలకు ప్రణాళిక చేశారు అధికారులు.