భారత్లో లౌకికవాద సూత్రాలు, వాటి ఆచరణకు ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్. పాలకులు 'సెక్యులరిజం' పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడానికి ప్రయత్నాలనూ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ద్వేషపూరిత శక్తులు ఏం చేసినా.. దేశ లౌకిక స్వభావాన్ని మార్చలేవని ఉద్ఘాటించారు.
థరూర్ రాసిన "ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్" పుస్తకం చర్చనీయాంశమైన నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన.
"సెక్యులరిజం అనేది పదమే కావచ్చు. కానీ ప్రభుత్వం దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించినా దాని ప్రాథమిక నిర్మాణం కారణంగా ఎప్పటికీ లౌకిక రాజ్యాంగంగానే ఉంటుంది" అని థరూర్ పేర్కొన్నారు. "స్వేచ్ఛగా ఆరాధించడం, మత ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు, సమానత్వం అనేవి రాజ్యాంగంలో పొందుపర్చారు. ఇప్పుడు సెక్యులర్ పదాన్ని తొలగిస్తే అవన్నీ అదృశ్యం కావు" అని అన్నారు థరూర్.
"అధికార ప్రభుత్వం సెక్యులర్ పదాన్ని తొలగించాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉండొచ్చు. విడదీయాలనే భావజాలంతో ముందుకెళ్తే మతపరమైన మైనార్టీలకు భారతీయ సమాజంలో చోటు ఉండదు. దేశంలో ప్రస్తుతం లౌకికవాద సూత్రాలు, వాటి ఆచరణకు ప్రమాదం ఏర్పడింది. అయితే ద్వేషపూరిత శక్తులు లౌకికవాదాన్ని మార్చేయగలవని నేనైతే విశ్వసించట్లేదు. ఎవరైనా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కచ్చితంగా వ్యతిరేకించాల్సిందే "
--శశిథరూర్, కాంగ్రెస్ నేత
చిదంబరం వ్యాఖ్యలపై...
ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్ నేత పి.చిదంబరం డిమాండ్ చేయడంపైనా స్పందించారు శశిథరూర్.
"ఆర్టికల్ 370 నిబంధన తాత్కాలికమని నెహ్రూ గతంలోనే చెప్పారు. అయితే రద్దు చేసేందుకు రాజ్యాంగం కొన్ని పద్ధతులను నిర్దేశించింది. సాధారణంగా ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎవరు ఎటువైపు అయినా మాట్లాడొచ్చు. అయితే రద్దు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పౌరులను రాత్రిపూట అదుపులోకి తీసుకోవడం, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ తరహాలో భారతీయ పౌరుల హక్కులకు భంగం కలగడాన్ని ఏ రాజకీయ పార్టీ సమర్థించదు."
-- శశిథరూర్
ఇదీ చూడండి: 'హిందూ పాకిస్థాన్'.. ఇదే భాజపా లక్ష్యం