రష్యా పర్యటనలో భాగంగా చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్ సమావేశం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్నాథ్ షెడ్యూల్లో అలాంటి సమావేశం లేదని స్పష్టం చేశాయి.
షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్నాథ్ సింగ్ రష్యాకు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. భారత్-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయిల్లో చర్చలు జరపనున్నారు.
ఎస్సీఓలో సభ్యదేశం కావడం వల్ల చైనా రక్షణ మంత్రి జెన్ ఉయ్ ఫెంఘీ కూడా ఈ భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యాతో అధికారులతో చర్చలు..
ఎస్సీఓ సమావేశంతో పాటు సెప్టెంబర్ 3న.. రష్యా రక్షణమంత్రి సహా ఇతర అత్యున్నత సైనిక అధికారులతో రాజ్నాథ్ చర్చలు జరపనున్నారు. భారత్ చేపట్టిన రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరనున్నారు. సెప్టెంబర్ 5న సింగ్ తిరిగి భారత్కు రానున్నారు.
రష్యాలో జరగనున్న సైనిక విన్యాసాలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకున్న ఐదు రోజులకే రాజ్నాథ్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. పాక్, చైనా సైన్యాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఇదీ చదవండి- మరోసారి రష్యా పర్యటనకు రాజ్నాథ్ సింగ్