కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ మేనెజ్మెంట్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టిన సుప్రీం గతేడాది తీర్పును వాయిదా వేసింది. ఈ ఆలయ మేనేజ్‌మెంట్ వివాదంపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం గతేడాది ఏప్రిల్ 10న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించనుంది.
'వివరణాత్మక జాబితా కావాలి'
ఆలయ నేలమాళిగల్లో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నాయని సంచలనంగా మారిన ఈ ఆలయ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. ఆలయ ఆస్తులు, నిర్వహణ బాధ్యతలను స్వాధీనం చేసుకోవాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 2011 మే 2 న సుప్రీం కోర్టు స్టే విధించింది. కల్లారాలుగా పేర్కొనే నేల మాళిగల్లోని విలువైన వస్తువులు, ఆభరణాలపై వివరణాత్మక జాబితా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
'కల్లారా బీ పై స్పష్టత వచ్చేనా'
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు 'కల్లారా బీ' తెరవడాన్ని నిలిపివేయాలని 2011 జూలై 8న పేర్కొంది. అనంతరం 2017 జూలైలో ఆలయంలో ఉన్న నేలమాళిగల్లోని ఒకదానిలో ఆధ్యాత్మిక శక్తితో అసాధారణమైన నిధి ఉందన్న వాదనలను పరిశీలిస్తామని తెలిపింది. దేవస్థానం మరమ్మత్తు కోసం, నిధుల భద్రత కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందన్న భయంతో మూసివేసినందున కల్లారా బీ ని తెరవాలని ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం కోర్టుకు చెప్పారు. అనంతరం ఆలయంలోని పనులను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కే ఎస్‌పీ రాధాకృష్ణన్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: బుధవారం భారత్- చైనా సైనికాధికారుల భేటీ