శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వీలుకల్పిస్తూ ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలంటూ వచ్చిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తీర్పు పునఃసమీక్షను కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. పిటిషనర్ల వాదనల్లో పసలేదని వివరించింది.
అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు... తాజాగా వైఖరి మార్చుకుంది. 10 నుంచి 50ఏళ్ల మధ్య వయసుగల మహిళలు గుడిలోకి వచ్చేందుకు అనుకూలమని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆలయ ప్రవేశంపై న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామని స్పష్టంచేసింది.
ఇదీ నేపథ్యం
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించాలని, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు పలువురు భక్తులు.
కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం
సుప్రీం తీర్పును అనుసరించి మహిళలకు ప్రవేశం కల్పిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆగ్రహించిన భక్తులు దేవస్థానానికి వెళ్లే దారులను నిర్బంధించారు. పోలీసుల రక్షణలో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని కొండకు చేరుకోకుండా అడ్డుకున్నారు.
జనవరి 2న ఇద్దరు మహిళల ప్రవేశం
భక్తుల నిరసనల మధ్య జనవరి 2న అయ్యప్ప ఆలయంలోకి కనకదుర్గ, బిందు ప్రవేశించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేరళ ప్రభుత్వమే పథకం ప్రకారం మహిళలను ఆలయంలోకి ప్రవేశించేలా రక్షణ కల్పించిందని పలువురు ఆరోపించారు. ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు తమకు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది న్యాయస్థానం.
ఇప్పటివరకు 50 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారి వివరాలను సమర్పించింది.
పునఃసమీక్ష కోసం 64 వ్యాజ్యాలు
శబరిమల ఆలంయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, తీర్పు అమలుపై స్టే విధించాలని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుమారు 64 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాజ్యాలను స్వీకరిస్తున్నట్లు నవంబర్ 13న కోర్టు తెలిపింది. జనవరిలో విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. కానీ తీర్పుపై స్టేకు నిరాకరించింది.
తీర్పు వెలువరించిన ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్ర సెలవుపై వెళ్లడం వల్ల విచారణ ఆలస్యమైంది. గత సెప్టెంబర్ 28న అన్ని వయస్కుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు.