'ఏఈఎస్' బాధిత చిన్నారుల చికిత్స కోసం అత్యవసరంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
బిహార్ ముజఫర్‌పూర్‌లో 'అక్యూట్ ఎన్సెఫాలిటీస్ సిండ్రోమ్' అంటువ్యాధితో ఇప్పటి వరకు 126కు పైగా చిన్నారులు మరణించారు. మరెంతో మంది చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరంతా సరాసరిన 10 ఏళ్ల వయస్సువారే.
ఈ పరిస్థితి తీవ్రత దృష్ట్యా... దీనిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది మనోహర్ ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం తక్షణమే చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని, బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సూర్యకాంత్ల ద్విసభ్య ధర్మాసనం.. 'ఏఈఎస్' బాధిత చిన్నారుల మరణాలపై సోమవారం (జూన్ 24న) విచారణ చేపడతామని తెలిపింది.
ఇదీ చూడండి: తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!