లైంగిక దాడి విషయంలో ట్రాన్స్జెండర్లకు కూడా సమానంగా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీనిని విచారించదగిన కేసుగా అభివర్ణించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. లైంగిక దాడుల నుంచి ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించేందుకు సరైన చట్టాలు లేకపోవడాన్ని గుర్తించింది.
ఇలాంటి విషయాల్లో ఎలాంటి చట్టాలు లేకుండానే తీర్పులు వెలువరించిన కేసుల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్కు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి రూపొందించిన విశాఖ మార్గదర్శకాలను ఈ నేపథ్యంలో ప్రస్తావించింది అత్యున్నత న్యాయస్థానం. చట్టాలు లేని కారణంగా స్వలింగ సంపర్కుల విషయాన్ని కూడా ఇందులో చేర్చింది.
ఈ కేసులో న్యాయశాఖ, సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వశాఖను ఇతర పార్టీలుగా పేర్కొన్నారు పిటిషనర్, న్యాయవాది రీపక్ కాన్సల్. ట్రాన్స్జెండర్లు, ట్రాన్స్సెక్సువల్స్, కిన్నర్, యూనిచ్లను లైంగిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టాలు లేవని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వీరిని 'మూడో లింగం'గా అత్యున్నత న్యాయస్థానం గుర్తించినప్పటికీ.. ఐపీసీలో ఎలాంటి నిబంధనలు లేవని వివరించారు. అందువల్ల వారికి కూడా సమాన హక్కులను కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి:- 'చక్రవడ్డీ మాఫీకి ఓకే.. మారటోరియం పొడిగింపే కష్టం'