సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 3 పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
అత్యున్నత న్యాయస్థానం, సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని లోగడ దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ 2010లో సుప్రీం కోర్టు ప్రధాన కార్యదర్శి, కేంద్ర ప్రజా సమాచార అధికారి, సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, కొలీజియం చర్చలు లాంటి అత్యంత రహస్య సమాచారం బహిర్గతం చేయడం ప్రమాదకరమని, అది న్యాయవ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది.