మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... అన్ని పక్షాల వాదనలు ఆలకించింది. అనంతరం మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని తెలిపింది.
లేఖల సమర్పణ...
విచారణలో భాగంగా ఈ వ్యవహారానికి సంబంధించిన రెండు లేఖలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి సమర్పించారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలిపేముందు జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ 3 పార్టీలను ఆహ్వానించగా అన్ని పార్టీలు విఫలమయ్యాకే రాష్ట్రపతి పాలన విధించారన్నారు.
2-3 రోజులు కావాలి...
ప్రభుత్వ ఏర్పాటు కోసం ఫడణవీస్‌కు గవర్నర్ పంపిన ఆహ్వాన లేఖను... ధర్మాసనానికి అందజేశారు. నవంబర్ 22న అజిత్ పవార్ మద్దతు లేఖ అందజేశారని కోర్టుకు వివరించారు. ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని అజిత్ పవార్ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. లోతైన విచారణ జరపాల్సిన అవసరం గవర్నర్‌కు లేదని తుషార్ మెహతా వాదించారు. ముందున్న వాస్తవాల ఆధారంగా మెజార్టీని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు ఫడణవీస్-పవార్ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే గవర్నర్ లేఖ చదివి వినిపించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సమాధానం ఇచ్చేందుకు 2-3 రోజుల సమయం కోరారు.
రోహత్గీ వాదనలు...
దేవేంద్ర ఫడణవీస్ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఎన్నికలకు ముందున్న మిత్రపక్షం శివసేన... ఎన్డీఏ నుంచి వెళ్లడం వల్లే రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత భాజపాకు అజిత్ పవార్ నుంచి మద్దతు లభించిందన్నారు. ఒక పవార్ తమ వైపు ఉంటే.. మరో పవార్ అటు వైపు ఉన్నారన్నారు. కుటుంబంలో కలహాలు ఉండవచ్చునని... దాంతో తమ పార్టీకి సంబంధం లేదని ముకుల్ రోహత్గీ తెలిపారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు అవకాశం లేదని.. గవర్నర్‌ను కోర్టు ఆదేశించజాలదని వాదించారు.
అజిత్ పవార్ తరఫున...
అజిత్ పవార్ తరఫున వాదనలు వినిపించిన మనీందర్ సింగ్... అజిత్ పవార్ ఇచ్చిన మద్దతు లేఖ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, వాస్తవికంగా సరైనదని తెలిపారు. ఎన్సీపీ శాసససభాపక్ష అధినేతగా అజిత్ పవార్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ లేఖ ఆధారంగా గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారని కోర్టుకు విన్నవించారు.
తెల్లారేసరికి అంతా అయిపోయింది...
కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్... మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి 7 నుంచి శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయిందని తెలిపారు. మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారని ఆరోపించారు. భాజపా-శివసేన బంధం తెగిపోవడానికి, కాంగ్రెస్-ఎన్సీపీకి సంబంధం లేదన్నారు.
తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ అంటున్నప్పటికీ.. ఆయన్ను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించారని ధర్మసనానికి వివరించారు సిబల్.
సింఘ్వీ వాదనలు...
ఎన్సీపీ- కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ... మహారాష్ట్రలో జరిగిన పరిణామం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభిప్రాయపడ్డారు. 54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉందంటున్న వారు... భాజపాకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారా అని సింఘ్వీ ప్రశ్నించారు. వారు సమర్పించిన లేఖ అజిత్ పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నదని.. మద్దతు లేఖ కాదన్నారు. అది 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమేనని సింఘ్వీ కోర్టుకు వివరించారు.
అనంతరం మరోసారి వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.... అసెంబ్లీ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయన్నారు. 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించజాలదని రోహత్గీ నివేదించారు. సభ నిర్వహణకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని కోరారు.
అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం.. మహారాష్ట్ర వ్యవహారంపై తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
- ఇదీ చూడండి: 'ఆపరేషన్ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్