కోర్టులను పూర్తిస్థాయిలో తెరవాలన్న అంశంపై వైద్యనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది. ఏడాది కాలంగా న్యాయస్థానాల్లో జరగాల్సిన వాదనలు, విచారణలు అన్నీ వీడియో కాన్ఫరెన్సుల్లోనే జరుగుతున్నాయి. ఈ విధంగా వాదనలు వినిపించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై వైద్యనిపుణుల సలహా కీలకమని వ్యాఖ్యానించింది. కరోనా సంక్షోభంలోనూ కోర్టులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కోర్టులను తెరచినా కరోనా కారణంగా న్యాయవాదులు హాజరు కావట్లేదని ధర్మాసనం తెలిపింది.
సంక్షోభ సమయాల్లో న్యాయవాదులకు అండగా ఉండాలన్న అంశంపై ఉన్నత న్యాయస్థానం స్పందించింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించి ఈ విషయంపై సమీక్షించాలని ఆదేశించారు. న్యాయవాదుల బార్ అసోసియేషన్లు కరోనా సమయంలో న్యాయవాదులకు అండగా నిలిచాయని తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. ప్రభుత్వం న్యాయవాదులకు వడ్డీలేని రుణాలు అందించేలా చూడాలని న్యాయవాదుల ప్రతినిధి ధర్మాసనాన్ని కోరారు. ఈ అంశంపై రెండు వారాల తర్వాత విచారణ చేస్తామని తెలిపింది.
ఇదీ చదవండి : బస్సుకు విద్యుత్ తీగలు తగిలి నలుగురు దుర్మరణం