ఉత్తరప్రదేశ్‌లో అరెస్టయిన పాత్రికేయుడు ప్రశాంత్ కనోజియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు యూపీ పోలీసులు.
పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు కనోజియా భార్య జగీశా అరోడా. అరెస్టు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
"ఇది స్వేచ్ఛా హక్కు. ప్రాథమిక హక్కు. ఇది చర్చించాల్సిన విషయం కాదు. బెయిల్ ఇస్తున్నాం. అంత మాత్రాన అతని ట్వీట్లు, సామాజిక మాధ్యమాల్లోని పోస్టులను సమర్థించినట్టు కాదు."
- సుప్రీం ద్విసభ్య ధర్మాసనం
ఆదిత్యనాథ్‌ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన వీడియోను పోస్టు చేశారనేది కనోజియాపై ఆరోపణ. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. దిల్లీలో ఉన్న ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి లఖ్‌నవూకు తరలించారు. ఈ వార్తలు ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్ ఎడిటర్నూ అదుపులోకి తీసుకున్నారు.
యోగిది అవివేక చర్య : రాహుల్
జర్నలిస్ట్ ప్రశాంత్, టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. యోగి నిర్ణయం అవివేకమని మండిపడ్డారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బెంగాల్లో బాంబుల మోత.. భయంలో స్థానికులు