కశ్మీర్ అంశంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కల్పించే అధికరణ 370రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 6పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయమని పిటిషన్లో పేర్కొనకుండా.. పిటిషన్‌దారు అసలేం కోరుకుంటున్నారో స్పష్టత లేదని, అర్థరహితంగా ఉందని శర్మను ప్రశ్నించారు. అరగంట పాటు చదివినా వ్యాజ్యం అర్థం కాలేదని మండిపడ్డారు.
"అసలు ఏం పిటిషన్ ఇది? ఈ వ్యాజ్యాన్ని నేను అరగంట చదివాను. అయితే... ఈ పిటిషన్ ఎందుకు వేశారో నాకు అసలు అర్థం కాలేదు. ఈ వ్యాజ్యాన్ని విచారించలేం.''
-జస్టిస్ రంజన్ గొగొయి, భారత ప్రధాన న్యాయమూర్తి
ఈ పిటిషన్ కొట్టివేస్తే సంబంధిత వ్యాజ్యాలన్నింటిపైనా ప్రభావం పడుతుందన్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి. అయితే.. పిటిషన్లన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని.. లోపాలను సరిచేసుకొని రావాలని స్పష్టం చేస్తూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.
అధికరణ 370పై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు.. సున్నితమైన అయోధ్య కేసుకు కేటాయించిన ధర్మాసనం విచ్ఛిన్నం అయిందని గుర్తుచేసింది అత్యున్నత న్యాయస్థానం.
మేమే మరింత సమయమిస్తాం...
కశ్మీర్‌లో మీడియా, సమాచార వ్యవస్థపై ఆంక్షలు సడలించాలంటూ స్థానిక ఎడిటర్ అనురాధా బేసిన్ వేసిన పిటిషన్‌నూ పరిశీలించింది సుప్రీం. పాత్రికేయులు తమ వృత్తిని కొనసాగించాలంటే సమాచార వ్యవస్థను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.
అయితే.. ల్యాండ్‌లైన్ వ్యవస్థ పనిచేస్తోందని, ఈ రోజు ఉదయం జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడినట్లు తెలిపింది ధర్మాసనం.
''మేం మరికొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థల్ని మెల్లమెల్లగా పునరుద్ధరిస్తున్నట్లు.. ఈ రోజే వార్తాపత్రికల్లో చదివాం. సంబంధిత పిటిషన్లతో కలిపి విచారణ చేపడుతాం.''
-సుప్రీం త్రిసభ్య ధర్మాసనం
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. 'జమ్ముకశ్మీర్‌లో రోజురోజుకూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టుకి వివరించారు.''
ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం.. తాము కేంద్రానికి మరికొంత సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. సంబంధిత పిటిషన్లతో కలిపి మరోసారి విచారణ జరుపుతామని కేసును వాయిదా వేసింది. అయితే... తేదీ మాత్రం ఖరారు చేయలేదు.