కార్యాలయాల్లో సీసీటీవీల ఏర్పాట్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎన్ఐఏ, ఎన్సీబీ సహా దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రతి ఒక్క పోలీసు స్టేషన్ లోపల, వెలుపల, ప్రధాన ద్వారం, లాక్అప్స్, రిసెప్షన్ ప్రాంతాల్లో సీసీటీవీల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాలని జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం కేంద్రానికి చెప్పింది.
కార్యాలయాల్లో ఏర్పాటు చేసే సీసీటీవీ వ్యవస్థలు తప్పనిసరిగా నైట్ విజన్‌ను కలిగి ఉండాలన్న సుప్రీంకోర్టు.. గరిష్ఠ స్థాయిలో డేటాను రికార్డు చేసే విధంగా వాటిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రజలను అరెస్టు చేసే అధికారమున్న అన్ని వ్యవస్థల కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. విచారణ పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఆ సీఎంలకు మోదీ ఫోన్- 'బురేవి'పై ఆరా