శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయ్యప్ప ఆలయ నిర్వహణపై 2011లో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించింది న్యాయస్థానం. భక్తుల సంక్షేమంతో పాటు దేవస్థాన నిర్వహణకు సంబంధించిన చట్టాన్ని వచ్చే ఏడాది జనవరి మూడో వారంలోగా కోర్టుకు నివేదించాలని ఆదేశించింది.
ప్రత్యేక బోర్డు అవసరం
కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తితిదే, గురవాయూర్ తరహాలో ప్రత్యేక బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించింది. ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించిన గతేడాది తీర్పులో ఏ మార్పూ లేదని స్పష్టం చేసింది.
" ఒకే ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో 3 వేల ఆలయాల నిర్వహణ ఉండటం సరికాదు. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమలను ప్రత్యేకంగా గుర్తించాలి. మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు కొనసాగుతుంది."
- సుప్రీంకోర్టు
శబరిమలకు మహిళలందరినీ అనుమతిస్తూ గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను పెండింగ్లో ఉంచింది న్యాయస్థానం. ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గతేడాది తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.