ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని విచారణ న్యాయస్థానాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.
ఒకవేళ బెయిల్ అభ్యర్థనను విచారణ న్యాయస్థానం తిరస్కరించినా... ఆయన్ను తీహార్ జైలుకు పంపరాదని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. బెయిల్ రాని పక్షంలో చిదంబరం సీబీఐ కస్టడీని గురువారం వరకు మాత్రమే పొడిగించాలని స్పష్టంచేసింది.
ఐఎన్ఎక్స్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడం సహా విచారణ కోర్టు సీబీఐ కస్టడీకి ఆదేశించడాన్ని సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. చిదంబరం పిటిషన్పై అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ సీబీఐకి తాఖీదులిచ్చింది.
సిబల్ వాదనలు...
చిదంబరం తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చిదంబరం వయసు 74ఏళ్లని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ను గృహ నిర్బంధంలో పెట్టాలని కోరారు.