ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు ఈసీ క్లీన్చిట్ ఆదేశాల రికార్డులను సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు. వారిద్దరిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు సుస్మిత తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. సాయుధ దళాలను ఎన్నికల్లో ప్రచారాంశాలుగా వినియోగిస్తూ మోదీ-షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్ ఫిర్యాదులను ఎలాంటి కారణాలు లేకుండానే ఈసీ కొట్టివేసిందని పేర్కొన్నారు. ఈసీ చర్య వివక్షకు సంకేతమని ఆరోపించారు.
వాదనలు విన్న ధర్మాసనం... ఈసీ జారీ చేసిన ఆదేశాలతో కూడిన మరో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
మహారాష్ట్రలోని లాతుర్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ సాయుధ దళాలను ప్రస్తావించారు. తొలిసారి ఓటర్లు... తమ ఓటును బాలాకోట్ దాడుల వీరులకు, పుల్వామా అమరులకు అంకితం ఇవ్వాలని పిలుపునిచ్చారు. వార్దా బహిరంగ సభలో... వయనాడ్‌లో మైనార్టీ ఓటర్లు ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ రెండింటిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా... మోదీకి ఈసీ సచ్ఛీలత పత్రం ఇచ్చింది.
ఇదీ చూడండి: సీజేఐపై 'కుట్ర': సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన