భాజపా నేతలు ఓడిపోతామనే నిరాశతో ప్రజల మధ్య చీలిక తెచ్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. ఏం చేసినా భాజపా పాచికలు పారవని, మే 23న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, భాజపా పాలనపై వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడారు.
ఏం మాట్లాడినా.. సమస్యలే ప్రధానాంశాలు
చెప్పేందుకు ఏమీ లేక భాజపా నేతలు... మందిరం-మసీదు, అలీ-భజరంగ్‌బలి, జాతీయవాదం అంటున్నారని ఎద్దేవా చేశారు సచిన్ పైలట్. వాటిని ప్రజలు పట్టించుకోరని అన్నారు. అభివృద్ధిలో వెనుకబాటు, భాజపా నెరవేర్చని హామీలే ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు సచిన్ పైలట్.
పరిస్థితి మారింది
2014తో పోలిస్తే దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు సచిన్. ఇప్పుడసలు మోదీ పవనాలు అనే మాటే లేదని స్పష్టం చేశారు. హిందీ రాష్ట్రాల్లోనూ ఈసారి భాజపాకు పరాభవం తప్పదన్నారు.
హింస పెరిగింది
భాజపా పాలనతో దేశంలో హింస పెరిగిపోయిందని ఆరోపించారు సచిన్ పైలట్.
" ఐదేళ్ల క్రితం మూకదాడులు, గోరక్షకుల దాడులు అనే మాటలు, చర్చే లేవు. అలాంటి చర్యలకు కొన్ని శక్తులు మద్దతునిస్తున్నాయి. గత ఐదేళ్లలో విద్వేష పూరిత దాడులు, హింస దేశంలో పెరిగిపోయాయి. ఇది దేశానికి మంచిది కాదు. " - సచిన్ పైలట్, రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి
ఎన్నికల తర్వాతే నాయకత్వంపై నిర్ణయం
భాజపాపై పోరాటాన్ని తమ పార్టీ అధ్యక్షుడే ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు సచిన్ పైలట్. అయితే గెలిచాక ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.
"జాతీయ స్థాయిలో భాజపాను ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్. భాజపా మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు కీలకమే. అందుకే కాంగ్రెస్‌దే నాయకత్వపాత్రగా ఉంటుందని అనుకుంటున్నా" - సచిన్ పైలట్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: మరోసారి ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్