జేఈఈ (మెయిన్) పరీక్ష నిర్వహణపై భాజపా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ప్రాంతీయ భాషల్లో జేఈఈ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె విమర్శలను తిప్పికొట్టారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారు.
కేంద్రం వివక్ష..
జాతీయస్థాయి సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ (మెయిన్) పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆంగ్లం, హిందీతో పాటు గుజరాతీ భాషలో మాత్రమే పరీక్షను పెట్టడమేంటని ప్రశ్నించారు. అన్ని స్థానిక భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. తమ మాదిరే ఇతర రాష్ట్రాలూ ఆందోళన వ్యక్తం చేయాలన్నారు.
'డివైడర్ దీదీ..'
జేఈఈ పరీక్షపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ. జేఈఈ పరీక్షను గుజరాత్లో నిర్వహిస్తున్న దానిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన వీడియోను జోడిస్తూ ట్వీట్ చేశారు. మీ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.. ఇలాంటి విభజన పూరిత ప్రకటనలు కాదంటూ మమతపై విరుచుకుపడ్డారు. అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఏ స్పష్టత..
అన్ని రాష్ట్రాలు ఇంజినీరింగ్ ప్రవేశాలకు వినియోగించుకోవలనే ఆలోచనతో 2013లో జేఈఈ పరీక్ష ప్రారంభమయిందని తెలిపింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాల్లో జేఈఈ (మెయిన్)ను గుజరాత్ మాత్రమే ఉపయోగించింది.. అందుకే గుజరాతీలో ప్రశ్నపత్రం తయారు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. 2014లో మహారాష్ట్ర అంగీకరించినప్పటికీ.. 2016లో వైదొలగటం వల్ల మరాఠీలో పేపర్ల తయారీ ఆగిపోయినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: గడువు సమీపిస్తున్నా తేలని 'మహా' ప్రతిష్టంభన