దేశ రాజధాని దిల్లీ ప్రాంతంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కోసం ఇ-టికెట్లను అక్రమంగా విక్రయించిన ఎనిమిది మంది ఐఆర్సీటీసీ ఏజెంట్లతో సహా 14 మందిని.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆపీఎఫ్) అరెస్టు చేసింది. వారి నుంచి రూ.6,36,727 విలువైన టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జూన్ 1 నుంచి అదనంగా 100 రైళ్లు ప్రయాణించనున్నట్లు రైల్వేశాఖ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి మద్యవర్తులు నకిలీ ఐడీలను ఉపయోగించి రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
"మే 21 నుంచి 100 రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభం అవుతాయి. ఇవి సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన రైళ్లు. అయితే ఇలాంటి ఏజెంట్ల అక్రమ కార్యకలాపాల వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది."
రైల్వేశాఖ
ఇ-టికెట్ల విక్రయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్. ఇలాంటి ఏజెంట్లపై ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.