ఆర్టికల్ 370 రద్దుతో ఉద్రిక్తతలు తలెత్తవచ్చన్న అనుమానాల నేపథ్యంలో విధించిన ఆంక్షలను జమ్ములో తొలగిస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర అదనపు డీజీపీ మునీర్ ఖాన్. కశ్మీర్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
శ్రీనగర్ సహా పలు జిల్లాలు, కశ్మీర్ లోయలో చెదురుమదురు ఘటనలు జరిగినా సమర్థంగా నిలువరించామని వెల్లడించారు మునీర్. కశ్మీర్ లోయలో కొంతమందికి పెల్లెట్ గాయాలైనట్లు ధ్రువీకరించారు అదనపు డీజీపీ. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడమే తాము సాధించిన అతిపెద్ద విజయమని తెలిపారు.
"జమ్ములో ఆంక్షలు ఎత్తేశాం. పాఠశాలలు సహా వివిధ సంస్థలు సాధారణంగా నడుస్తున్నాయి. కశ్మీర్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను పూర్తిస్థాయిలో అంచనా వేశాకే నిషేధాజ్ఞలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకమొత్తంగా ఆదేశాలు జారీ చేయలేదు. ఆంక్షల తొలగింపునకూ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేశాకే నిర్ణయం ఉంటుంది. ఈ పరిశీలన చేయాల్సింది జిల్లా అధికారులే. ప్రస్తుతం మా ముఖ్య లక్ష్యం ఆగస్టు 15. శాంతి పూర్వకంగా వేడుకలు నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం."
-మునీర్ఖాన్, జమ్ముకశ్మీర్ అదనపు డీజీపీ
ఇవీ చూడండి: కర్తవ్యమే దైవం: తాతయ్య అంత్యక్రియలకు వెళ్లని కలెక్టర్